కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం కోసం టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ 11 రోజుల పాటు ఆమరణ నిరహార దీక్ష చేశారు. రమేష్‌తో పాటు ఎమ్మెల్సీ బీటెక్ రవి కూడా దీక్ష చేపట్టారు. ఆయన దీక్ష ద్వారా ఏం సాధించారో ఒకసారి పరిశీలిద్దాం.
ఇప్పుడే దీక్ష ఎందుకు చేయవలసి వచ్చింది?
రాష్ట్ర విభజన సమయంలో, కేంద్రం విభజన బిల్లులో బయ్యారం మరియు కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమల ఏర్పాటును పరిశీలిస్తామని చేర్చింది. అయితే కేంద్రం గత నెలలో సుప్రీమ్ కోర్టులో రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఆయా ప్రాంతాల్లో ఉక్కు కర్మాగారాల ఏర్పాటుకు సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలించి నిర్ణయం తీసుకున్నామని, ఆ ప్రాంతాల్లో ఉక్కు కర్మాగారాలు సాధ్యం కావని స్పష్టంగా అఫిడవిట్ దాఖలు చేసింది.
అయితే ఆందోళనలు చేపట్టకుండా తాము ఒక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తామని, మెకాన్ సంస్థ స్టీల్ ఫ్యాక్టరీల సాధ్యాసాధ్యాలపై పరిశీలన జరుపుతుందని కూడా ప్రకటించింది. అయితే ఇది కేంద్ర ప్రభుత్వం స్టీలు పరిశ్రమలు ఏర్పాటు చేసే ఉద్దేశ్యంలో లేదని, దాటివేత ధోరణిని అవలంభిస్తుందని స్పష్టంగా బయట పెట్టింది. దానితో ప్రజల్లో కేంద్రం ఈ విషయంలో మోసం చేస్తుందనే భావన కలిగింది.
ఇలా కొంచం వేడెక్కి, కేంద్రానికి వ్యతిరేకంగా ఉన్న ప్రజాభిప్రాయాన్ని మరింత రెచ్చగొట్టి తమకు అనుకూలంగా మలచుకోవడానికి ఎదో ఒక ప్రయత్నం చేయాలనే ఉద్దేశ్యంతో తెలుగుదేశం పార్టీ వ్యూహకర్తలు దీనిని రూపొందించారు. తాము అధికారం లో ఉన్న ప్రాంతంలో వారు బంద్ లు, ధర్నాలు, ఆందోళనలు చేస్తే విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి వారు నిరాహార దీక్షను ఎంచుకున్నారు.
కడపలోనే ఎందుకు చేసారు?
ఉక్కు పరిశ్రమ స్థాపించవలసింది కేంద్ర ప్రభుత్వం. కడపలో దీక్ష చేస్తే వారు స్పందించే అవకాశాలేమైనా ఉన్నాయా అంటే ఎవరిని అడిగినా దాదాపు శూన్యమనే చెబుతారు. అయినా అక్కడే ఎందుకు చేసారు?
కడపలోనే ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కేంద్రం నిరాకరించింది. ఇంకా తెలుగు దేశం పార్టీ అక్కడ బలహీనంగా ఉంది కాబట్టి స్థానిక నేత ఒకరు అక్కడ దీక్ష చేస్తే పార్టీ పట్ల సానుభూతి వస్తుందని, తద్వారా బలపడవచ్చని వారు భావించారు.
వారు ఈ దీక్షతో ఏం సాధించదలుచుకున్నారు?
దీక్ష చేయడం వల్ల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలుగు దేశం వారు కొన్ని రాజకీయ ప్రయోజనాలను ఆశించారు.
వాటిలో మొదటిది తాము బిజెపికి వ్యతిరేకమని ప్రజల్లో వ్యాపింప చేయటం. నాలుగేళ్లపాటు తమకు కేంద్ర ప్రభుత్వం లో భాగస్వామ్యం ఉంది కనుక ప్రజలను అది మర్చిపోయేలా చేసి, ప్రత్యేక హోదా తో సహా అన్ని విభజన హామీలు అమలు చేయని పాపం పూర్తిగా బీజేపీ పైన నెట్టివేసి తాము బయటపడటం.
రెండవది ప్రతిపక్ష వైయస్సార్సీపికి బిజెపికి సంబంధం అంటగట్టి వారి మీద దుమ్మెత్తి పోయడం. తామే అధికారంలో ఉండి మరీ దీక్షలు చేసి ప్రతిపక్షం ఏమీ చేయటం లేదనే భావన కలిగించటం.
సీఎం రమేశ్ దీక్ష ప్రారంభించిన సమయంలో ఆయన ప్రసంగం వింటే ఇవి స్పష్టమవుతాయి. స్టీల్ ప్లాంట్ సాధించాలనుకున్నవాడు అది ఎలా వస్తుందో అనే మాట్లాడతాడు, ప్రతిపక్షం మీద విరుచుకపడడు. కేంద్రం స్పందించటానికి రాష్ట్రం ఏమైనా కార్యాచరణ రూపొందించిందా ? అంటే లేదనే చెప్పవచ్చు. అంటే దీక్షను కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే చేపట్టారు.
దీక్ష చేస్తున్నప్పుడు ఏం జరిగింది?
దీక్ష జరుగుతున్న సమయంలో తెలుగు దేశం వర్గాలు, ఉక్కు పరిశ్రమను ఎలా సాధించుకుందాం అనే చర్చను ప్రజలలో తీసుకురాలేకపోయాయి. అంతే కాకుండా దీక్ష ప్రారంభిస్తున్నపుడు, దీక్ష సమయంలోనూ నాయకులు బిజెపిని, ప్రతిపక్ష పార్టీలను తిట్టడం, అవి ఉక్కు పరిశ్రమ కోసం ప్రయత్నించ లేదనడం వారి ఉద్దేశ్యాలను ప్రజల ముందు బహిర్గత పరిచాయి. ఉక్కు పరిశ్రమ రావాలని ప్రజలు కోరుకుంటున్నప్పటికీ వారు దీక్షతో మమేకం కాలేకపోయారు.
సీఎం రమేశ్ దీక్షాస్థలి పైన ఉత్సాహంగా అటూ ఇటూ తిరుగుతుండటం సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి ఆస్కారమిచ్చింది. పత్రికలలో కూడా ఆ తరహా కథనాలు రావటంతో ప్రజలు కూడా అనుమానపడటం ప్రారంభించారు. ఇదే సమయంలో వైరల్ గా మారిన తెలుగుదేశం ఎంపీల వీడియో పరిస్థితిని మరింత దిగజార్చింది.
ప్రజల నుంచి ఆశించినంత స్పందన రాకపోవటం, కేంద్రం అసలే పట్టించుకోకపోవటం, విమర్శలు పెరిగిపోవటంతో దీక్ష ఎలా ముగించాలనే విషయంపై మల్లగుల్లాలు పడ్డారు. చివరకు దీక్ష 10 వ రోజు ఎంపీల బృందాన్ని ఢిల్లీకి పంపి కేంద్రంనుండి ఏదైనా సానుకూల ప్రకటన చేయించుకోవాలని భావించినా అది సాధ్యం కాలేదు. మంత్రిని అడిగి సీఎం రమేశ్ కు ఒక కాల్ మాత్రం చేయించుకోగలిగారు.
దీక్ష విరమణ
"ఉక్కు పరిశ్రమ సాధించే వరకు పోరాడతామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇవ్వడంతో ఆయన దీక్ష విరమణకు అంగీకరించారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా నిమ్మరసం అందుకున్న అనంతరం దీక్ష విరమించారు." ఇది తెలుగు దేశం అనుకూల ఛానెల్ లో వచ్చిన వార్త. అంటే ముఖ్యమంత్రి అప్పటివరకు పోరాటానికి వ్యతిరేకంగా ఉన్నాడా? దీక్ష ద్వారా రమేష్ ఆయనను పోరాడేలా ఒప్పించారా?
దీక్ష విరమణ తర్వాత సీఎం రమేష్ ఐదు నిమిషాల పాటు ప్రసంగించటం మరిన్ని విమర్శలకు తావిచ్చింది. ఉక్కు పరిశ్రమ కోసం చిత్తశుద్ధితో ప్రయత్నించకుండా, దీని ద్వారా రాజకీయ ప్రయోజనాలు ఆశించడంతో దీక్ష అపహాస్యం పాలయింది.
Post a Comment