జ్యేష్ఠ మాస శుక్ల పక్ష దశమిని దశపాపహర దశమిగా పేర్కొంటారు. ఈ రోజుకి పది రకాలైన పాపాలను తొలగించే శక్తి ఉందని నమ్ముతారు.
లోకంలో తెలిసీ, తెలియక పాపాలు చేయడం మానవ సహజం. అయితే మనం చేసింది పాపమని, దాని ద్వారా అశుభ ఫలితాలు పొందే ప్రమాదమున్నదని గ్రహించి తొలగించుకోవటం గొప్ప ప్రయత్నం. అటువంటి అవకాశాన్ని కలిగించేదే దశపాపహర దశమి వ్రతం.
పౌరుష్యమనృతం చైవపైశున్యం చాపి సర్వశ |
అసంబద్ధ ప్రలాపంచ వాఙ్మయంస్యాత్ చతుర్విధం ||
పరుషంగా మాట్లాడటం, అబద్ధాలు చెప్పటం, అసంబద్ధమైన మాటలు మాట్లాడటం, సమాజం వినలేని మాటలు మాట్లాడటం - ఈ నాలుగు రకాల పాపాలు మాటల ద్వారా చేసేవి.
పరద్రవ్యేష్యోభిధ్యయానం మనసానిష్ఠ చింతనం |
వీతధాభినివేషంచ మానసం త్రివిధం స్మృతం ||
తనది కాని ధనము, వస్తువులపై వ్యామోహం కలిగి ఉండటం, ఇతరులకు ఇబ్బంది కలిగించే పనులను చేయటం, ఇతరులకు చెడు చేయాలనుకోవడం ఈ మూడు మానసికంగా చేసే పాపాలు.
అదత్తానాముపాదానాం హింసాచైవ విధానతః |
పరదారోపనోవాచ కాయికం త్రివిధం స్మృతం ||
అర్హత లేనివానికి దానాన్ని ఇవ్వడం, శాస్త్రము ఒప్పని హింసను చేయడం, పర స్త్రీని లేదా పురుషున్ని స్వీకరించడం ఈ మూడు శరీరంతో చేసే పాపాలు. మొత్తం ఇవి పది పాపాలు.
సామాన్యంగా నిత్య జీవితంలో ఎక్కువగా చేసేందుకు అవకాశమున్న ఈ పది పాపాలను తొలగించుకోవటానికి దశపాపహరదశమి వ్రతం ఆచరించాలని వ్రతనిర్ణయకల్పవల్లి అనే గ్రంథం స్పష్టం చేస్తుంది. నదీ స్నానం అనేది ఈ వ్రతంలో ప్రధాన ఘట్టం.
జ్యేష్ఠ శుద్ధ దశమి రోజు ఏ నదిలో స్నానం చేసినా విశేషమైన ఫలముంటుంది. ముఖ్యంగా గంగా నదిలో స్నానం చేస్తే గొప్ప విశేషం. కాశీ లోని దశాశ్వమేధ ఘాట్ దీనికి ప్రసిద్ధి. ఈ రోజు గంగా స్నానం పాపాలను తొలగిస్తుంది.
గంగావతరణం జరిగింది జ్యేష్ఠ శుద్ధ దశమి రోజే అని స్మృతి కౌస్తుభం అనే గ్రంథం వివరిస్తుంది. ఈ నాటి హస్తా నక్షత్ర సమయంలో భగీరథుని తపః ఫలితంగా శివుని జటాజూటంనుండి భువికి ఏతెంచింది. గంగకు దగ్గరగా లేని వారు, సమీపంలోని నది, చెఱువు లేదా బావి దగ్గరకు వెళ్లి వ్రతమాచరించాలి.
వ్రత విధానం
దశ పాపహరదశమి వ్రత విధానం స్కంద పురాణంలో వివరించబడింది. ఈనాటి ఉదయాన్నే దగ్గరలోని నీటి వనరు వద్ద స్నానాన్ని ఆచరించి, గంగాదేవిని పూజించాలి. ప్రతిమ నందు గానీ, కలశమందు గానీ గంగా దేవిని ఆవాహన చేసి పూజించాలి. తెల్లని వస్త్రాలు ఆ తల్లికి సమర్పించి గంగాస్తోత్రం పఠించాలి. ఆ తర్వాత విష్ణు మూర్తిని గానీ, శివుడిని గానీ పూజించాలి.
దశ పాప హర దశమి స్నాన సంకల్పం
మమ ఏతజ్జన్మ జన్మాంతర సముద్భూత దశవిధ పాపక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం దశహర మహాపర్వ నిమిత్తం స్నానమహం కరిష్యే.
Post a Comment