రాష్ట్ర విభజన లో ప్రజల పాత్ర ఎంత? |
రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు, జాతీయ పార్టీల తో సహా తమ ఎన్నికల అవసరాల కోసం సీమాంధ్ర ప్రజలను మోసగించాయి. మొదట బిజెపి 1997 కాకినాడ సభలో ఒక ఓటు రెండు రాష్ట్రాలని చెప్పి రాష్ట్ర విభజన ప్రతిపాదన కు శ్రీకారం చుట్టింది. తర్వాత 2004 ఎన్నికల కోసం కాంగ్రెస్, 2009 ఎన్నికల కోసం తెలుగు దేశం పార్టీ ప్రత్యేక తెలంగాణ నినాదాన్ని అందిపుచ్చుకున్నాయి. 2014 లో సరైన ప్రాతిపాదిక లేకుండా కాంగ్రెస్ సీమాంధ్ర ప్రజల వెన్నులో పొడిచింది. రాష్ట్ర విభజన వల్ల నేను బాధపడి నేను పది రోజులు అన్నం కూడా తినలేదు. ఇవి ఇటీవల కాకినాడ సభలో పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలలో కొన్ని.
మరి రాష్ట్ర విభజన లో పవన్ పాత్ర లేదా?, 2009 లో ప్రజా రాజ్యం పార్టీ లో కీలక స్థానం లో ఉండి కూడా ఆ పార్టీ సామాజిక తెలంగాణ అని అనకుండా ఎందుకు ఆపలేక పోయాడు. ఒక వేళ పవన్ కు ఇష్టం లేకుండా పార్టీ నాయకత్వం ఆ నిర్ణయం తీసుకుంది అనుకుంటే, అప్పుడే ఆ పార్టీ నుండి ఎందుకు బయటకు రాలేదు. అంటే పార్టీ లో ఉండి సామాజిక తెలంగాణ అని నినాదంతో ఓట్లు సంపాదించి తెలంగాణ ప్రజలను మోసం చేద్దామనుకున్నాడా?, తను చేసింది మర్చిపోయి అన్ని పార్టీలను తిడితే మాత్రం తాను సచ్చీలుడైపోతాడా?, మరి ఇన్ని తెలిసిన పవన్ మోసం చేసిన ఈ పార్టీలకు 2014 ఎన్నికలలో ఎందుకు మద్దతు ఇచ్చాడు?
ఒక సారి హామీ ఇచ్చి ఎన్నికలకు వెళ్లిన తర్వాత రాజకీయ పార్టీలకు తెలంగాణ ఇవ్వము అనే అవకాశం లేకుండా పోయింది. కేవలం కొంత కాలం పాటు రెండు కళ్ల సిద్ధాంతం, రెండు చెవుల సిద్ధాంతం అని గానీ, నిర్ణయం తీసుకోవటం కోసం చర్చిస్తున్నాం అని గానీ కాలయాపన చేయగలిగాయి. 2014 లో ఉన్న పరిస్థితులలో కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకుంటే బిజెపి ప్రత్యేక తెలంగాణ నినాదం తో అధికారంలోకి వచ్చి మరీ ఇచ్చేది.
ఇక రాష్ట్ర విభజన లో ప్రజల పాత్ర ఎంత అనే విషయానికి వస్తే 2004 ఎన్నికలప్పుడు తెలుగు దేశం పార్టీ సమైక్యాంధ్ర నినాదం తో ఎన్నికలకు వెళ్ళింది. కానీ ఎవరూ పెద్దగా ఆదరించలేదు. ప్రత్యేక తెలంగాణ అనే నినాదం తో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీకి సీమాంధ్ర ప్రజలు బ్రహ్మ రథం పట్టారు. అంటే మన ప్రజలు ప్రత్యేక తెలంగాణ కు ఒప్పుకున్నట్టే కదా. లేక ప్రజలు కూడా రాజకీయ పార్టీల మాదిరిగానే తెలంగాణ ప్రజలను మోసం చేద్దామనుకొని తామే మోసపోయారా?
సాధారణంగా ఒక ప్రాంత ప్రజలు మరో ప్రాంత ప్రజల్ని మోసం చేద్దామని ఆలోచించరు. 2004 ఎన్నికల లో గెలిచిన వైయెస్సార్ సీమాంధ్ర ప్రజలకు తెలంగాణా ఇవ్వకున్నా ఏమీ కాదనే ఆశలు కల్పించాడు. అక్కడి ప్రజల్ని మోసగించవచ్చనే భ్రమల్ని ఇక్కడి ప్రజల్లోనే కాకుండా రాజకీయ పార్టీల్లో కూడా కల్పించాడు. దాని ఫలితంగానే సమైక్య వాది అయిన చంద్రబాబు కూడా 2009 ఎన్నికల్లో తెలంగాణా నినాదాన్ని అందిపుచ్చుకున్నాడు. 2009 ఎన్నికలప్పుడు తెలంగాణా ప్రాంతం లో ఎన్నికలైపోయాక రాయలసీమ లో హైదరాబాద్ వెళ్లాలంటే VISA కావాల్సి వస్తుంది అని ప్రసంగించి రెండు ప్రాంతాల మధ్య విద్వేషాలు పెరగటానికి వైయెస్సార్ కారణం అయ్యాడు.
వైయెస్సార్ చనిపోయిన తర్వాత జరిగిన పరిణామాలతో కేంద్ర హోం మంత్రి పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ప్రకటన చేసిన తర్వాత మన ఆంధ్ర ప్రాంత నాయకులు, ప్రజలు దానిని అడ్డుకోవటానికి ప్రయత్నించారు. ఇప్పుడు పార్లమెంట్ లో చేసిన ప్రకటన కు విలువ లేదా అని ఆక్రోశించే ఈ నేతలు / ప్రజలు అందరికీ అప్పడు పార్లమెంట్ పవిత్రత గుర్తుకు రాలేదు. సీమాంధ్ర ప్రాంత ప్రజలు కూడా ఇక్కడి నాయకులు చేసే విన్యాసాలను నమ్మి తెలంగాణ రావటం సాధ్యం కాదని బలంగా నమ్మారు. కానీ తెలంగాణ ఇచ్చే సరికి తట్టుకోలేకపోయారు.
2001 లో తెలంగాణ ఉద్యమాన్ని కెసిఆర్ ప్రారంభించినప్పుడే తెలంగాణ ప్రజలతో, ప్రజా సంఘాల తో చర్చలు జరిపి వారికి కొన్ని వెసులుబాట్లు కల్పించి ఉంటే పరిస్థితి ఇంత దూరం వచ్చి ఉండేది కాదు. గుప్పెడు మంది హైదరాబాద్ లో పని చేసే ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ నాయకులు కొంచం సర్దుకొని తెలంగాణ వారికి కొన్ని ఎక్కువ అవకాశాలు కల్పించి ఉంటే బావుండేది. తెలంగాణ ప్రజలకు వారిని గురించి ఆలోచిస్తున్నారనే భావన కలిగేది. దాని స్థానం లో ఎన్నికల హామీ ఇచ్చి రాజకీయ పార్టీలు, చట్ట సభల్లో ప్రకటించి మరీ ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయన్న భావన కలిగితే వారు మాత్రం ఎందుకు కలిసి ఉంటారు?.
ఎవరు ఏం అనుకున్నా రాష్ట్ర విభజన జరిగి పోయింది. ఇప్పుడు మన రాష్ట్రం వేరు. తెలంగాణ వేరు. నేను అప్పుడు బాధ పడ్డాను, అన్నం తినలేదు అని చెప్పటం ఇప్పుడు తెలంగాణ ప్రజల మనో భావాల్ని దెబ్బ తీయటమే అవుతుంది. మనకేం కావాలో ఆలోచించుకొని తెలంగాణ ప్రజల, నేతల సహకారం పొందటానికి ప్రయత్నం చేయటమే శ్రేయస్కరం. లేదా వారి మానాన వారిని వదిలి మనకు ఏం కావాలో కేంద్రంలో సాధించుకోవాలి.
Post a Comment