వివస్వత్సప్తమి, వైవస్వత మనువు జన్మదినం. ఇతనే ప్రస్తుతం నడుస్తున్న మన్వంతరానికి అధిపతి. ప్రస్తుతం మనం వైవస్వత మన్వంతరంలో 27 మహాయుగాలు గడచి 28వ మహాయుగంలో సత్య, త్రేతా, ద్వాపర యుగాల తరువాత నడుస్తున్న కలియుగం లో ఉన్నాము.
వివస్తే ప్రభయా ఆచ్ఛాదయతీతి వివస్వాన్
శక్తిని ప్రసరించగలిగేవాడు కనుక, సూర్య దేవునికి వివస్వతుడనే పేరు కూడా ఉంది. సూర్య దేవునికీ, అతని భార్య అయిన సరయు (శరణ్య) కు జన్మించిన కుమారుడే వైవస్వత మనువు. ఈ మనువుకి శ్రద్ధాదేవుడనే మరో పేరు కూడా ఉంది. ఇతనికి ఒకసారి తుమ్ము వచ్చినపుడు ముక్కు రంధ్రంనుండి వెలువడిన బిడ్డ ఇక్ష్వాకుడు, ఇక్ష్వాకు వంశమునకు మూలపురుషుడయ్యాడు. వీరు ఆద్యులైన సూర్య వంశీకులు. ఈ వంశంలోనే శ్రీరామ చంద్రుడు జన్మించాడు.
ఆషాఢ మాసంలోని శుక్లపక్ష సప్తమిని వివస్వత్సప్తమి లేదా భాను సప్తమి గా జరుపుకుంటారు. హిందూ నమ్మకాల ప్రకారం ఈ రోజున పగటి సమయంతో , రాత్రి సమయం ఘడియ విఘడియల తేడా లేకుండా సరిసమానం గా ఉంటుంది. వివస్వత్సప్తమి రోజున సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. ఈ రోజున ఆదిత్య హృదయం పఠించటం శ్రేయస్కరం.
సప్తమి తిథి విశిష్టత
సప్తమి తిథికి అధిదేవత సూర్య భగవానుడు, ఈ రోజు సూర్యుడు రథాకారంలో కనిపిస్తాడని జ్యోతిష్య శాస్త్రం వివరిస్తుంది. ఏడు (సప్త) సంఖ్య కు సూర్యునికి విశేషమైన సంబంధం ఉంది. సూర్య భగవానుని జన్మ తిథి సప్తమి. అతని రథానికి ఏడు గుర్రాలు ఉంటాయి. అతని కిరణాల్లోని కాంతి ఏడు రంగుల కలయిక. ఒకవేళ సప్తమి ఆదివారం వస్తే దానిని మరింత విశేషమైనది గా భావిస్తారు. తిథుల్లో సప్తమి, వారాల్లో ఆదివారం సూర్యారాధన కు ప్రశస్తమైనవి.
Post a Comment