ఉత్తరద్వార దర్శనం

ఉత్తరద్వార దర్శనం
ఉత్తరద్వార దర్శనం 
మార్గశిర శుక్ల ఏకాదశిని ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి గా జరుపుకుంటారు. అర్చకులు ఈ రోజున దేవాలయానికున్న ఉత్తర ద్వారాన్ని తెరిచి, ఆ ద్వారం గుండా దైవాన్ని దర్శింపచేస్తారు. ఈ విధమైన దర్శనాన్ని ఉత్తర ద్వార దర్శనమని అంటారు. దీనిని వైకుంఠ ద్వార దర్శనంగా, అత్యంత పుణ్య ప్రదంగా, మోక్షప్రదంగా భావిస్తారు. ఈ రోజున పుణ్య క్షైత్రాలన్నీభక్తులతో కిట కిట లాడతాయి. 

ఎందుకిలా వైకుంఠ ఏకాదశి ఒక్క రోజున్నే ఉత్తర ద్వార దర్శనం చేయిస్తారు? అనే విషయం పై వివిధ రకాలైన వాదనలున్నాయి. 

1. ఉత్తర దిక్కుకి ఒక విశిష్టత ఉంది. ఋషుల కాలం నుండి కూడా ఇంటి నమూనాలో గానీ దేశ పటంలో గానీ పై భాగాన్ని ఉత్తరంగా, క్రింది భాగాన్ని దక్షిణంగా పరిగణిస్తారు. అలాగే మానవ దేహం లో ముఖ్యమైన శిరస్సును ఉత్తర భాగం గా భావిస్తారు. కాబట్టే అక్షతలను శిరస్సు పైనే వేస్తారు. వివాహ సమయం లో వధూ వరులను ఉత్తర దిక్కు గానే ఏడడుగులు నడిపిస్తారు. రాజుల కాలం లో కూడా దండ యాత్రల సమయంలో ముందుగా సైన్యాన్ని ఉత్తర దిక్కు గానే నడిపించే వారు. ఎక్కడైనా ఆలయం సమీపం లో ఏదైనా నది ఉత్తర దిశ గా ప్రవహిస్తే దానిని ఉత్తర వాహినిగా పరిగణిస్తారు. ద్వారం అంటే ద్వి (రెండు) అరలు (రెక్కలు) కల తలుపు అని అర్థం. మన దేహాలయం లో కూడా ఉత్తర దిక్కైన శిరస్సులో ఉండే ద్వారాన్ని తెరిస్తే అక్కడ పరమాత్మ కొలువై ఉంటాడట. ఉత్తర దిశను విశిష్టమైనదిగా భావించటం వల్ల ఉత్తర ద్వార దర్శనానికి పవిత్రత ఏర్పడిందని భావిస్తారు.  

2. ఈ సృష్టి దక్షిణం వైపునుంచి ఉత్తరం వైపుకు అపసవ్య దిశలో  తిరుగుతూండగా, అందులోని అంతర్భాగం ఉత్తరం వైపునుంచి దక్షిణానికి సవ్య దిశలో తిరుగుతుంది. కనుక ఈ రెండింటి మధ్య ఉండే వైరుధ్యం వల్ల కలిగిన ఆకర్షణ శక్తి చేత మనం ఈ భూమిని  అంటిపెట్టుకొని ఉన్నాం దానినే భూమ్యాకర్షణ శక్తి అని అంటారు. ముక్కోటి ఏకాదశి రోజు తర్వాత రెండు మూడు రోజులలో సూర్యుడు ఉత్తర దిగ్భాగంలో ప్రయాణం చేస్తూంటాడు. ఈరోజున మనం ఉత్తర ద్వార దర్శనంతో ఉత్తర దిగ్భాగాన్ని అనుసరించి ప్రయాణం ప్రారంభం చేసినట్లయితే తప్పకుండా కైవల్యం లభిస్తుంది. ఈ భూమితో ఉండే ఆకర్షణ సంబంధిత సంబంధాలన్నీ కూడా తొలగిపోయి ఆ శ్రీమన్నారాయణ మూర్తిని చేరుకుంటాము. భవ బంధాలన్నీ కూడా తొలగిపోయి మోక్షం లభిస్తుంది అనే వాదన కూడా ఉంది. 

3. మార్గశిర మాసం రైతుకు పంటలు చేతికొచ్చే రోజులు కావటంతో జనం ముందుకు దేవుడ్ని తీసుకురావడం అనే ఆనవాయితీ ని తీసుకువచ్చారు. ఎలాగూ ఆ సమయంలో రైతులు ఖాళీగా వుంటారు, తిండిగింజలకు లోటుండదు కాబట్టి ఇతోధికంగా భగవంతుడికి కానుకలు సమర్పించుకుంటారు. ఈ నెల రోజుల ఆదాయం, ఏడాది పొడవునా అయ్యవార్ల జీవనానికి సరిపోవాలి కాబట్టి కేవలం ఇంటి ముందుకు దేవుడ్ని తీసుకువచ్చి దర్శన భాగ్యం కలిగించటమే కాకుండా, వారిని కనీసం గుడిదాకా తీసుకురావటానికే ఉత్తరద్వార దర్శనం ఏర్పాటు చేయబడిందనే వాదన కూడా ఉంది. 

0/Post a Comment/Comments

Previous Post Next Post