ఏ విలువల వైపు పయనిస్తున్నాం? |
శనివారం ఉదయం పోలీసులు హైదరాబాద్ లోని భవాని నగర్ లో జరిపిన కార్డ్ఆన్ సెర్చ్ ఆపరేషన్ లో 22 మంది అనుమానితులు, కొన్ని ఆటోలు, బైక్ లు, డమ్మి తుపాకులు పెట్రోల్ మరియు గుడుంబా పాకెట్లు దొరికాయి. ఇంతవరకూ బానే వుంది. దీని తర్వాతే మనందరికీ అవమానకరమైన, సభ్యసమాజాన్ని, మనుషుల్లోని మానవతా విలువల్ని ప్రశ్నించే విషయం వుంది. కట్టు బానిసలు గా పని చేస్తున్న దాదాపు 200 మంది చిన్న పిల్లలు కూడా ఈ ఏరియా లో దొరికారు. ఉత్తర ప్రదేశ్, బీహార్ లకు చెందిన వీరందరూ 4-12 సంవత్సరాల వయసు వారు. కేవలం 2000 నుండి 5000 రూపాయల జీతానికి రోజుకి 12 నుండి 14 గంటల పాటు అత్యంత ప్రమాదకరమైన రసాయనాల మద్య గాజుల మరియు తోళ్ళ పరిశ్రమలలో పనిచేస్తున్నారు.
ఈ పిల్లల్లో కొంతమంది వారి వూరి పేరు, తల్లిదండ్రుల పేర్లు చెప్పలేనంత చిన్నవారు. వీళ్ళు కేవలం 4 చిన్న రూముల్లో కుక్కబడి వున్నారు. ఒంటిపై ఎలర్జీలు, ఇతర పుండ్లు వున్నాయి. కప్పుకోవటానికి సరిఅయిన దుప్పట్లు లేవు. కనీస వైద్యం కూడా అందటం లేదు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం బ్రోకర్లు వీరి తల్లిదండ్రులకు 5-10వేల అడ్వాన్సు చెల్లించి తెసుకొని వచ్చారు.
ఈ విషయం లో కొన్ని ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.
- దాదాపు 200 మంది చిన్నపిల్లలు పనిచేస్తున్నా పోలీసులకు ఎందుకు తెలియకుండా పోయింది? లేక ఆ ప్రాంత పోలీసులు లంచాలు తీసుకొని ఊరుకున్నారా?
- ఆ ప్రాంతం లోనివారు కానీ, చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎందుకు కంప్లయింట్ చేయలేదు?, మానవత్వ విలువలు తగ్గి పోయాయా?, పోలీసులతో మనకెందుకని ఊరుకున్నారా?, ప్రజలతో ఫ్రెండ్లీ గా ఉంటామని పోలీసులు చెప్పేవి ఒట్టి మాటలేనా?
- తల్లిదండ్రులు పిల్లలకు తిండి కూడా పెట్టలేని పరిస్థితి లో వుంటే వారిని కనటం ఎందుకు?, ఇంత ప్రమాదకరమైన పనికి పంపించటం ఎందుకు?
- ఇప్పుడు వీరిని వీళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి పంపిస్తే వారు స్కూల్ కి పంపిస్తారని నమ్మకం ఏమిటి? వారిని మరో పనికి పంపిస్తారేమో?
ఈ సంఘటన తో సంబంధం వున్న బ్రోకర్లకి, పరిశ్రమల ఓనర్లకు శిక్షలు పడాలని కోరుకోవటం తప్ప మనం ఏమీ చేయలేమేమో?
Post a Comment