చాతుర్మాస్య వ్రతం


చాతుర్మాస్యం అంటే నాలుగు నెలల కాలం. ఈ చాతుర్మాస్య ప్రాశస్త్యాన్ని వరాహ పురాణం పేర్కొంటుంది. చాతుర్మాస్య వ్రతవిధానాన్ని స్కంద మరియు భవిష్యోత్తర పురాణాలు చెబుతున్నాయి.

వేద కాలంలో వర్ష, హేమంత, వసంత ఋతువులు మాత్రమే ఉండేవి. ఈ మూడు ఋతువుల్లో ఒక్కో ఋతువులో నాలుగేసి మాసాలు ఉండేవి. సంవత్సరం వర్ష ఋతువుతో ప్రారంభమయ్యేది. అందుకే సంవత్సరానికి వర్షం అనే పేరు వచ్చింది. కాగా ఆషాఢం సంవత్సరంలో మొదటి నెలగా ఉండేది. ప్రతి ఋతువు ఆరంభంలోనూ యజ్ఞ యాగాదులు చేసేవారు.

అప్పటి వ్యవస్థలో ఆషాఢం సంవత్సరంలో తొలి నెల కావటంతో ఆషాఢ శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి అయింది. ఇప్పటికీ మనం ఈ ఏకాదశిని తొలి ఏకాదశిగానే పిలుస్తున్నాం. ఈ తొలి ఏకాదశికే ప్రథమ ఏకాదశి, శయన ఏకాదశి అనే పేర్లు ఉన్నాయి. ఈ తొలి ఏకాదశి రోజునే సృష్టి, స్థితి, లయల్లో స్థితి కార్యాన్ని నిర్వహించే మహా విష్ణువు పాలసముద్రంలో యోగ నిద్రకు ఉపక్రమిస్తాడు. ఆ విధంగా శయనించిన విష్ణువు నాలుగు నెలల తర్వాత కార్తిక శుద్ధ ఏకాదశి రోజున నిద్ర నుండి మేల్కొంటాడు. ఈ కార్తీక శుద్ధ ఏకాదశికి  ఉత్థాన ఏకాదశి అని పేరు. ఈ ఉత్థాన ఏకాదశి మరుసటి రోజే క్షీరాబ్ధి ద్వాదశి. పూర్వం ఈ ద్వాదశి రోజునే దేవతలు, రాక్షసులు అమృతం కోసం క్షీర సాగరాన్ని మధించారు. అందుకే ఇది క్షీరాబ్ధి ద్వాదశి అయింది. పాల సముద్రం చిలక బడినందువల్ల ఈ రోజుకి చిలుకు ద్వాదశి అనే మరొక పేరు కూడా ఉంది.

చాతుర్మాస్యం అంటే నాలుగు నెలల కాలం అని అర్థం. నాలుగు నెలల పాటు ఆచరింపబడే చాతుర్మాస్య వ్రతం ఆషాఢ శుద్ధ ఏకాదశి అయిన తొలి ఏకాదశి రోజున ప్రారంభింపబడి, క్షీరాబ్ధి ద్వాదశిగా పిలవబడే కార్తిక శుద్ధ ద్వాదశి రోజు ముగుస్తుంది. అంటే విష్ణువు శయనించి ఉన్న ఈ నాలుగు నెలలు చాతుర్మాస్య వ్రతం ఆచరింపబడుతుంది.

భగవంతుని పైన మనస్సును లగ్నం చేయటమే ఈ చాతుర్మాస్య వ్రతంలోని ముఖ్య ఉద్దేశ్యం. ఈ కాలంలో సన్యాసులు, యతులు మొదలైన వారు తమ పర్యటనలను నిలిపి ఒక చోటనే దీక్షతో అనుష్ఠానాలను కొనసాగిస్తారు. పీఠాధిపతులు కూడా ఈ కాలాన్ని జపతాపాలకు వినియోగిస్తారు. శిష్య ప్రభోదాలకు, అభ్యసనానికి ముఖ్యమైన కాలంగా ఈ నాలుగు నెలల కాలం చెప్పబడుతుంది.

విరాగులు ఆధ్యాత్మిక చింతన కోసం ఆచరించే ఈ వ్రతాన్ని గృహస్థులు కూడా ఆచరించవచ్చు.  భీష్ముడు శేష ధర్మాలతో ఈ చాతుర్మాస్య వ్రతాన్ని స్త్రీలు కూడా ఆచరించాలని చెప్పాడు. చాతుర్మాస్య వ్రతాన్ని స్కంద పురాణం, భవిష్యోత్తర పురాణం, బ్రహ్మవైవర్త పురాణం పేర్కొంటున్నాయి. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు ఉపవాసం ఉండి, ఈ వ్రతాన్ని ప్రారంభించాలని శ్రీకృష్ణుడే స్వయంగా ధర్మరాజుతో చెప్పినట్లు బ్రహ్మవైవర్త పురాణం చెబుతోంది. అయితే ఆషాఢ శుద్ధ ద్వాదశి నుండి చాతుర్మాస్యాన్ని ప్రారంభించాలని స్మృతి కౌస్తుభంలో చెప్పబడింది.

ఆషాఢ పౌర్ణమి నుండి శ్రావణ పౌర్ణమి వరకు శాక వ్రతాన్ని ఆచరించాలి. ఈ శాక వ్రతంలో ఏవిధమైన ఆకుకూరలు గానీ, కాయగూరలు గానీ తినకూడదు. ఇక శ్రావణ పౌర్ణమి నుండి భాద్రపద పౌర్ణమి వరకు దధి వ్రతాన్ని పాటించాలి. అంటే ఈ కాలములో పెరుగును తినకూడదు. అదే విధంగా భాద్రపద పౌర్ణమి నుండి  ఆశ్వయుజ పొర్ణమి వరకు క్షీర వ్రతాన్ని ఆచరించాలి. ఈ కాలంలో పాలు, పాల పదార్థాలు తినకూడదు. చివరగా ఆశ్వయుజ పౌర్ణమి నుండి కార్తీక పౌర్ణమి వరకు ద్విదళ వ్రతాన్ని ఆచరించాలి. ఈ ద్విదళ వ్రతంలో పప్పు పదార్థాలను తినకూడదు.

ఇంకా చాతుర్మాసంలో
  • ఇతరుల ఇండ్లలో వండిన ఆహారాన్ని తినకూడదు.
  • పచ్చళ్ళు, ఊరగాయలు తినకూడదు.
  • బెల్లము, చింతపండు, రేగు పండు, వంకాయ, గుమ్మడికాయ, ముల్లంగి, పొట్లకాయ, ఉలవలు మొదలైనవి తినకూడదు.
  • ఆహార పదార్థాలను భగవంతునికి నివేదించాలి.
  • నేల మీదనే నిదురించాలి.
  • బ్రహ్మచర్యాన్ని ఆచరించాలి.
చాతుర్మాస్యంలో కామ్య వ్రతం అనే ఆచారం కూడా ఉంది. ఈ వ్రతంలో కొన్ని వస్తువులను మాత్రమే తినడమో, వదిలివేయడమో చేస్తారు. ఈ వ్రతంలో భాగంగా బెల్లాన్ని విడిచిపెడితే మధుర స్వరం, నూనెను వదిలి వేస్తే దేహ సౌందర్యం, తాంబూలాన్ని వదిలిపెడితే భోగ సిద్ధి లభిస్తాయి. చాతుర్మాస్యంలో యోగాభ్యాసం వలన బ్రహ్మపదం, విష్ణువును పూజించడం వలన గోదానఫలాన్ని పొందవచ్చు.

0/Post a Comment/Comments

Previous Post Next Post