ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసినా 2014 ఎన్నికలలో తెలంగాణాలో కాంగ్రెస్ ఎందుకు గెలవలేకపోయింది?

తెలంగాణ ఇస్తే 2014 ఎన్నికలలో ఖచ్చితంగా విజయం సాధిస్తామని కాంగ్రెస్ అధిష్ఠానం భావించింది. కానీ తెలంగాణ ఇచ్చినప్పటికీ ఆ ప్రాంతంలో జరిగిన ఎన్నికలలో ప్రజలు వారిని ఆదరించలేదు. ఉద్యమ ప్రభావం తీవ్రంగా ఉన్న నిజామాబాద్, కరీంనగర్, మెదక్ లాంటి జిల్లాల్లో అయితే 1-2 సీట్లు గెలవటం కూడా వారికి గగనంగా మారింది. కాంగ్రెస్ పార్టీకి ఎందుకిలా జరిగింది? 

ప్రత్యేక రాష్ట్రం ఇస్తే ఎలాగైనా గెలుస్తామన్న అతి నమ్మకంతో తెలంగాణ ప్రజల మనోభావాలతో కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో ఆడుకుంది. 2009లో తెలంగాణ ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కు తీసుకున్నారు. ఆ తరువాతే ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. కమిటీల పేరుతో సంవత్సరాల పాటు కాలయాపన చేసారు. ప్రతీ పది-పదిహేను రోజులకు ఒకసారి కోర్ కమిటీ మీటింగ్ అనీ, హోం మంత్రిత్వ శాఖా సమావేశం అనీ, తెలంగాణా పై నిర్ణయం తీసుకుంటున్నట్టు స్థానిక నాయకులు ఇక్కడ ప్రచారం చేసి, ప్రజల్లో లేనిపోని ఆశలు కల్పించి మరీ నిరాశ పరిచేవారు. ఒక దశలో అయితే ఇక కాంగ్రెస్ వల్ల ప్రత్యేక రాష్ట్రం రాదని తెలంగాణ ప్రజలు భావించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించే కొందరు చర్చల్లో, ప్రసంగాలలో మరియు సామాజిక మాధ్యమాలలో తెలంగాణపై, ఇక్కడి ప్రజలపై, ఉద్యమంపై  అవహేళనగా మాట్లాడేవారు. ఇలాంటివన్నీ కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవటం వలన జరిగిన జాప్యం వల్లనే జరిగాయని ప్రజలు భావించారు.  

తెలంగాణను పూర్తి స్థాయిలో వ్యతిరేకించే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన వ్యాఖ్యలు, చేపట్టిన చర్యలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరింత కోపాన్ని కలిగించాయి. తెలంగాణా వాదులు సభలు ఏర్పాటు చేసుకుంటే అనుమతులు ఇవ్వకపోవటం, పోలీసుల సహాయంతో నిర్బంధించటం, రాష్ట్ర ఏర్పాటు ఖాయమైన తరువాత కూడా సీమాంధ్ర ప్రాంతం నుండి హైదరాబాద్‌కు ప్రజలను ప్రత్యేక రైళ్లలో రప్పించి మరీ పోలీసుల సహాయంతో సభను నిర్వహించటం లాంటివి కూడా ప్రజలలో ఆ పార్టీపై వ్యతిరేక భావానికి కారణమయ్యాయి.

2004 లోనే తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రజలకు హామీ ఇచ్చింది. వారు ఇచ్చిన హామీని నెరవేర్చటానికి తాము ఉద్యమాలు, త్యాగాలు చేయవలసి వచ్చిందని ప్రజలు భావించారు. 2014లో తెలంగాణ ఇచ్చిన తరువాత కాంగ్రెస్ నాయకులు ప్రజలతో తాము తెలంగాణ ఇచ్చాం కాబట్టి ప్రజలు రుణపడి ఉండాలని, ఓట్లు వేయాలని ప్రసంగించేవారు. 10 సంవత్సరాలపాటు కాలయాపన చేసిందని ప్రజలు కాంగ్రెస్ పై ఆగ్రహంగా ఉన్న సమయంలో నాయకులు అలా ప్రసంగించటం కూడా వారి మనోభావాలను మరింత దెబ్బతీసింది. అదే సమయంలో కెసిఆర్ ప్రజలలో తాను ఇన్ని సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసమే కట్టుబడి ఉన్నానన్న నమ్మకాన్ని కలిగించగలిగారు. 

2014 ఎన్నికల సమయానికి కూడా తెలంగాణ రాష్ట్ర సమితికి అన్ని జిల్లాల్లో పూర్తి స్థాయి సంస్థాగత నిర్మాణం లేదు. ఆ పార్టీ కేవలం కొన్ని జిల్లాలకే పరిమితమనే భావన ఉండేది. దానితో టిఆర్ఎస్ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మెజారిటీ వస్తుందని కాంగ్రెస్ నాయకులు అంచనా వేయలేకపోయారు. అందుకే వారు విలీనం/ పొత్తు కోసం పూర్తి స్థాయిలో ప్రయత్నించలేదు. కేవలం భావోద్వేగాల ఆధారంగానే ఆ పార్టీ తమకు పట్టులేని ప్రాంతాలలో కూడా తిరుగులేని ప్రభావం చూపగలిగింది.   

రాష్ట్ర ఏర్పాటు తరువాత కేవలం తెలంగాణ రాష్ట్ర మనోభావాలను, ప్రయోజనాలను పరిరక్షించే ప్రభుత్వం మాత్రమే ఏర్పడాలని ప్రజలు భావించారు. తెలంగాణ ఏర్పాటులో జరిగిన జాప్యం, గందరగోళం వల్ల కాంగ్రెస్ పార్టీ ఆ నమ్మకాన్ని వారిలో కలిగించలేకపోయింది.  

0/Post a Comment/Comments

Previous Post Next Post