దక్షిణ భారతం కన్నా పాకిస్తాన్ అంటేనే ఇష్టం - సిద్ధూ

మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ దక్షిణ భారత దేశానికి వెళ్ళటం కన్నా పాకిస్తానుకు వెళ్లేందుకే ఎక్కువ ఇష్టపడతానని చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. అంతేకాక పాకిస్తాన్ సైన్యాధ్యక్ష్యుడు కమర్ జావేద్ బాజ్వాను కౌగిలించుకోవటాన్ని కూడా తప్పుగా భావించట్లేదని కూడా ఆయన పునరుద్ఘాటించారు.

కసౌలి లిటరేచర్ ఫెస్టివల్ ప్రారంభం సందర్భంగా సిద్ధూ ప్రసంగిస్తూ "నేను దక్షిణ భారత దేశానికి వెళితే ఆహార, భాషా సమస్యలు ఎదురవుతాయి. కానీ పాకిస్తాన్లో అటువంటి ఇబ్బందులేమీ ఉండవు. సౌత్ ఇండియాలో వణక్కం మరియు రెండు, మూడు పదాలు తప్ప నాకు మిగతావి అర్థం కావు. ఇడ్లీ వంటి వంటకాలు ఉంటాయి. కానీ నేను అక్కడి వంటను ఎక్కువ తినేలేను. వారి సంస్కృతి భిన్నంగా ఉంటుంది. అదే పాకిస్తానుకు వెళితే  వారు పంజాబీ, హిందీ మరియు ఆంగ్ల భాష మాట్లాడతారు మరియు మా ఆహార అలవాట్లనే కలిగి ఉంటారు. వారు నాకు సంబంధించిన వారుగా అనిపిస్తుంది." అన్నారు. 

సిద్ధూ ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారం సందర్భంగా పాకిస్తాన్ వెళ్ళినప్పుడు అక్కడి సైన్యాధ్యక్ష్యున్ని కౌగిలించుకున్నందుకు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. కానీ దానిని కూడా ఆయన, కర్తార్పూర్ కారిడార్ని తెరిస్తే హగ్ బదులు ముద్దు కూడా ఇస్తాను అని ఈ  ప్రసంగం సందర్భంగా సమర్థించుకున్నారు. 

కాగా సిద్ధూ వ్యాఖ్యలపై బిజెపి నేతలనుండి, మరియు సోషల్ మీడియా నుండి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఆర్ఎస్ఎస్ సిద్ధూను దేశ ద్రోహిగా అభివర్ణించగా, బిజెపి నేతలు పాకిస్తాన్ ఏజెంట్ అనీ, కాంగ్రెస్ పార్టీ నుండి బహిష్కరించాలని, పాకిస్తాన్ అంటే అంత ప్రేమ ఉంటే ఇక్కడ మాట్లాడే బదులు ఇమ్రాన్ ఖాన్ క్యాబినెట్లో చేరాలని విమర్శలు చేసారు. అన్నాడీఎంకే నేతలు మాట్లాడుతూ సిద్ధూకి పాకిస్తాన్ ఇష్టమైతే అక్కడికే వెళ్లి ఉండాలని కానీ దక్షిణ భారత దేశంపై మాట్లాడటం మానుకోవాలని అన్నారు. సోషల్ మీడియాలో అయితే ఇంకా తీవ్ర స్థాయి విమర్శలతో పాటు మీర్ జాఫర్, జైచంద్ ల వారసుడిగా కూడా సిద్ధూను అభివర్ణించారు.  

0/Post a Comment/Comments

Previous Post Next Post