అమెరికాలో తెలుగు నిజంగానే వెలిగిపోతుందా?

గత రెండు రోజులుగా అమెరికాలో తెలుగు భాష వెలిగిపోతున్నట్లు ప్రముఖ తెలుగు పత్రికలలో, చానెళ్లలో వార్తలు వస్తున్నాయి. నిజంగానే మన భాషకు, ఆ దేశంలో అంత వైభవం వచ్చిందా?

అమెరికా జనాభా 32 కోట్లు. తాజా గణాంకాల ప్రకారం అక్కడ తెలుగు మాట్లాడే వారి సంఖ్య కేవలం నాలుగు లక్షలు అంటే జనాభాలో దాదాపు 0.1%.  అక్కడ ఎక్కువగా మాట్లాడే తొలి పదిహేను భాషలలో తెలుగు భాషకు ఇంకా స్థానం దక్కలేదు. అమెరికాలో హిందీ, ఉర్దూ, గుజరాతీ లాంటి భారతీయ భాషలు మాట్లాడే వారి సంఖ్య కూడా తెలుగు మాట్లాడేవారి సంఖ్య కన్నా ఎక్కువే.  

సెంటర్ ఫర్ ఇమ్మిగ్రేషన్ స్టడీస్ సంస్థ, అమెరికన్లు వారి ఇళ్లలో ఏ భాష మాట్లాడుతున్నారో తెలుసుకునేందుకు సర్వే నిర్వహించింది. ఈ సంస్థ అధ్యయనం ప్రకారం 2010 నుండి 2017 మధ్య తెలుగు మాట్లాడేవారి సంఖ్య 86% పెరిగింది. తెలుగు అక్కడ అతి చిన్న భాషా సమూహం కావటం మూలాన ఏటా వలస వస్తున్న వారి వల్ల శాతం ప్రకారం చూస్తే భారీగా పెరిగినట్లు కనిపిస్తుంది. ఆ సంస్థ ఈ గణాంకాలను విడుదల చేసి నెల రోజులయింది. దీనిని ఆధారంగా చేసుకుని మన పత్రికలు, చానెళ్లు అక్కడ తెలుగు మాట్లాడేవారి శాతంలో పెరుగుదల ఉందని కాకుండా, అక్కడ 'తెలుగు వెలిగిపోతుంది', 'అమెరికాలో తెలుగు పాగా', 'ఎక్కడ చూసినా తెలుగోళ్ళే' లాంటి హెడింగులు పెట్టి మరీ ఊదరగొడుతున్నాయి. 

అయితే తెలుగు పత్రికలు ఈ వార్తను ఇప్పుడే ఎందుకు ప్రచురించాయి అంటే ప్రపంచ ఆర్థిక వేదిక విడుదల చేసిన వీడియోలో ఈ ప్రస్తావన ఉన్నట్లు ఒక 'సిండికేటెడ్ న్యూస్ ఏజెన్సీ' ఇప్పుడు ప్రచురించింది. సృజనాత్మకత తగ్గి పూర్తిగా సిండికేటెడ్ న్యూస్ కొనుగోలుపై ఆధారపడిన ఈ రోజులలో అన్ని ప్రముఖ పత్రికలు ఇప్పుడు దీనిని ప్రధాన వార్తగా మార్చేసాయి. 

0/Post a Comment/Comments

Previous Post Next Post