తెలంగాణా ఎన్నికలలో బిజెపి ప్రభావమెంత?

పార్లమెంటు ఎన్నికలకు దాదాపు ఆరు నెలల ముందు దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్న ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. వీటి ఫలితాల ప్రభావం కొంతవరకు పార్లమెంటు ఎన్నికలపై పడే అవకాశం ఉండటంతో భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నది. అయితే ఆ పార్టీకి ముఖ్యమైన ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు కూడా ఎన్నికలు జరిగే జాబితాలో ఉండటంతో తెలంగాణపై పూర్తిస్థాయి దృష్టిని సారించే అవకాశం తక్కువే.

2014లో జరిగిన ఎన్నికలలో  తెలుగుదేశం పార్టీతో ఉన్న పొత్తు, దేశవ్యాప్తంగా మోడీకి అనుకూల పవనాలు ఉండటం వంటివి కలసి రావటంతో బిజెపి ఐదు అసెంబ్లీ స్థానాలలో విజయం సాధించింది. ముఖ్యంగా హైదరాబాద్ పట్టణంలో ఎక్కువ ప్రభావం చూపగలిగింది. అయితే ఈ సారి బీజేపి ఒంటరిగా తెలంగాణా ఎన్నికల బరిలో దిగనుంది. బిజెపి అధ్యక్ష్యుడు అమిత్ షా కూడా నిన్న హైద్రాబాద్లో మొత్తం 119 అసెంబ్లీ స్థానాల్లో ఒంటరిగా బరిలోకి దిగుతామని ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితులలో ఒకసారి స్థూలంగా బిజెపి బలాన్ని మరియు విజయావకాశాల్ని పరిశీలిద్దాం.

తెలంగాణావ్యాప్తంగా చూస్తే రాజకీయ వాతావరణం ఏమాత్రం బిజెపికి అనుకూలంగా లేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలపటం, ఒక్క సాగునీటి ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా కల్పించకపోవడం, 14వ ఫైనాన్స్ కమిషన్ ద్వారా దేశవ్యాప్తంగా నిధులు నష్టపోయిన కేవలం రెండు రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి కావటం, పెట్రోల్-డీజిల్ ధరలు, ప్రత్యేక హైకోర్టు, తెలంగాణాకంటూ కేంద్రం ప్రత్యేకంగా చేసిందేమీ లేకపోవటం వంటివాటిని కెసిఆర్ మరియు ఇతరులు ఎన్నికలు దగ్గరపడిన సమయంలో తీవ్రంగా ప్రచారం చేసే అవకాశముంది.

బిజెపి పరిపూర్ణానంద స్వామిని సీఎం అభ్యర్థిగా ఉంచి హిందూత్వ అజెండాతో తెలంగాణ ఎన్నికల బరిలోకి దిగనుంది అనే కొన్ని వార్తలు వినవచ్చాయి. కానీ ఆ తరహా రాజకీయాలు ఈ ప్రాంతంలో ప్రభావం చూపటం కష్టమే. 

హైదరాబాద్ ప్రాంతంలోని నియోజకవర్గాలపై బిజెపికి ఎక్కువ ఆశలు ఉన్నాయి. కానీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన మునిసిపల్ ఎన్నికలలో ఆ పార్టీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. సిట్టింగ్ అభ్యర్థులు ఉన్న అంబర్ పేట్, ఉప్పల్, ఖైరతాబాద్, ముషీరాబాద్ మరియు గోషామహల్ వంటి స్థానాలపై పార్టీకి ఎక్కువ ఆశలున్నాయి. వీటితోపాటు హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల మరియు మల్కాజిగిరి పార్లమెంట్ స్థానాల పరిధిలోని అన్ని నియోజకవర్గాలపై వారు తీవ్రస్థాయిలో దృష్టిని సారించే అవకాశముంది. ఈ ప్రాంతాలలోని చాలా స్థానాలలో పార్టీ బలమైన క్యాడరును, అభ్యర్థులను కలిగి ఉంది కానీ ప్రజలలో మాత్రం గత ఎన్నికల నాటి సానుకూలత అయితే లేదు.

హైదరాబాద్ పట్టణ పరిధిని దాటి చూస్తే మిగతా జిల్లాల్లో మొత్తం కలిపి మహబూబ్ నగర్, నిజామాబాద్ వంటి  రెండు మూడు పట్టణ నియోజకవర్గాలలో తప్ప బిజెపికి పెద్దగా సంస్థాగత నిర్మాణం లేదు. ఆ నియోజక వర్గాలలో కూడా పార్టీకి బలమైన అభ్యర్థులు లేరు. ఏ పార్టీతో కూడా పొత్తు లేకపోవటంతో వాటిలో కూడా విజయావకాశాలు అంతంత మాత్రమే. తెలంగాణాలో బిజెపియేతర ప్రతిపక్షాలు మహాకూటమిగా ఏర్పడుతుండటంతో వాటిలో టికెట్ రాని అసంతృప్తులను గానీ, అధికార టిఆర్ఎస్ పార్టీలోని అసంతృప్తులను గానీ కొన్ని స్థానాల్లో బిజెపి ఆకర్షించే అవకాశముంది. అలా ఎవరైనా బలమైన అభ్యర్థులు దొరికి జిల్లాల్లో 1-2 స్థానాల్లో విజయం సాధించినా అది సంచలనమే. రాష్ట్రంలో గతంలో గెలిచిన 5 సీట్ల సంఖ్యను నిలుపుకోవాలంటే రాజకీయ పరిస్థితులలో పెనుమార్పులు రావటం కానీ, ఏదైనా అద్భుతంగానీ జరగాలి. 

0/Post a Comment/Comments

Previous Post Next Post