గణపతి పత్రి - ఔషధ ఉపయోగాలు

వినాయక పూజలో ఏకవింశతి పూజ అనేది ఒక ప్రధాన భాగం. ఏకవింశతి అంటే ఇరవై ఒకటి. గణనాథుడికి ఇష్టమైన సంఖ్య 21.ఈ పూజలో భాగంగా ఆయనను 21 రకాల పత్రితో పూజించటం మన ఆచారం. ఈ 21 రకాల పత్రి ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఓం ఓషధీవతంతునమః అనేది కూడా వినాయకుని సహస్ర నామాలలో ఒకటి.

ఈ 21 రకాల పత్రి యొక్క ఔషధీ ఉపయోగాలు

మాచీపత్రం ఇది నులి పురుగుల్ని పోగొడుతుంది. కుష్ఠు, బొల్లి, దప్పికలను నివారిస్తుంది. ఆకుల్ని కళ్లపై పెట్టుకుంటే నేత్ర దోషాలు తొలుగుతాయని, శిరస్సుపై పెట్టుకుంటే తలనొప్పి తగ్గుతుందనే విశ్వాసం కూడా ఉంది.

బృహతీపత్రం ఈ పత్రిని నేల మునగ అని కూడా అంటారు. ఈ పత్రి జ్వరం, జలుబు, దగ్గు, కఫము వంటి వాటికి ఔషధంగా పని చేస్తుంది. శ్వాస దోషాలని, హృదయ దోషాల్ని, మలబద్దకాన్ని నివారిస్తుంది.

బిల్వపత్రం ఈ ఆకుకు మారేడు దళమని కూడా పేరు ఉంది. ఇది దుర్వాసనను నివారిస్తుంది.

దుర్వాయుగ్మం గరికనే ఈ పేరుతో పిలుస్తారు. ముక్కు వెంట కారే రక్తాన్ని నివారిస్తుంది. సర్పికి, రక్త పైత్యానికీ, మూత్ర బంధానికీ ఔషధంగా భావిస్తారు.

దత్తూరపత్రం దత్తూరపత్రం అంటే ఉమ్మెత్త ఆకు. ఉమ్మెత్త రసాన్ని తలకు మర్దన చేస్తే ఊడిపోయిన వెంట్రుకలు మొలుస్తాయి. జుట్టు రాలడం నివారింపబడుతుంది. మానసిక రోగాలను తగ్గించటానికి కూడా దీనిని ఉపయోగిస్తారు.

బదరీపత్రం రేగు ఆకును ఈ పేరుతొ పిలుస్తారు. ఇది ఎముకలకు బలాన్నిస్తుంది. ఇది బాల రోగాలను నయం చేస్తుంది.

అపామార్గం ఉత్తరేణి ఆకును ఈ పేరుతొ పిలుస్తారు. చర్మ రోగాలు నయం చేయటానికి ఇది ఉపయోగపడుతుంది.

తులసీపత్రం ఈ ఆకు శ్లేష్మాన్ని హరిస్తుంది. క్రిముల్ని నశింపజేస్తుంది. దగ్గును, వాంతులను తగ్గిస్తుంది. మూత్రబంధాన్ని అరికడుతుంది.

చూతపత్రం అంటే మామిడి ఆకు. లేత ఆకులను పెరుగుతో కలిపి తింటే అతిసారం తగ్గటానికి ఉపయోగపడుతుంది. మామిడి జీడి, పసుపు కలిపి రాస్తే కాళ్ళ ఒరుపులు తగ్గుతాయి. మామిడి ఆకు తోరణాలు వాతావరణ కాలుష్యాన్ని తగ్గిస్తాయి.

కరవీరపత్రం అంటే గన్నేరు ఆకు. ఇది కుష్ఠు రోగుల దురదలు పోగొడుతుంది.

విష్ణుకాంత పత్రం ఇది కఫం, వాతం, వ్రణాలు మరియు క్రిములను హరిస్తుంది.

దాడిమీపత్రం అంటే దానిమ్మ ఆకు. ఇది వాతాన్ని, పిత్తాన్ని, కఫాన్ని హరించి హృదయానికి బలాన్ని చేకూర్చుతుంది.

దేవదారుపత్రం దేవదారు తైలం వాపులను హరిస్తుంది. ఎక్కిళ్ళను, చర్మరోగాలు తగ్గించే గుణాలు ఈ ఆకులకు ఉన్నాయి. 

మరువకపత్రం ఈ ఆకులు వాత, శ్లేష్మాదులను హరిస్తాయి. శ్వాస నాళాలకు సంబంధించిన రుగ్మతలను, హృద్రోగాలను తగ్గిస్తాయి. తేలు, జెఱ్ఱి వంటి పురుగుల విషాన్ని కూడా హరిస్తాయి. 

సింధూరపత్రం దీనిని వావిలి ఆకుగా కూడా పిలుస్తారు. వీటిని పురిటి స్నానానికి వాడతారు. ఆకుల కాషాయం శూలి, గ్రహణి మొదలగు వ్యాధుల క్రిములను నశింపచేస్తుంది. దీనిని ముద్దగా చేసి నుదుట పట్టీ వేస్తే తలపోటు తగ్గుతుంది. 

జాజిపత్రం ఇది వేడి చేస్తుంది. శరీరానికి తేజస్సునిస్తుంది. జఠదీప్తిని కలిగిస్తుంది. కంఠస్వరాన్ని బాగు చేస్తుంది. దగ్గును తగ్గిస్తుంది. నోటి దుర్వాసనను పోగొడుతుంది. 

గండకీపత్రం దీనిని తీగగరిక అని కూడా పిలుస్తారు. దీని రసం అపస్మారక స్థితిని, పైత్య వికారాన్ని మూర్ఛలను తగ్గిస్తుంది. నులి పురుగుల్ని, వాటి వలన వచ్చే వ్యాధులను కూడా నివారిస్తుంది. 

శమీపత్రం అంటే జమ్మి ఆకు. ఇది మూల వ్యాధిని నివారిస్తుంది. అతిసారం, కుష్టు, రక్తస్రావాలను ఉపశమింపచేస్తుంది. వెంట్రుకలు నల్లగా ఉండటానికి దోహదపడుతుంది. దీని గింజల చూర్ణం పాలతో కలిపి తాగితే వీర్య వృద్ధి అవుతుంది. 

అశ్వత్థపత్రం అంటే రావి ఆకు. ఇది గర్భస్థ దోషాలను నివారిస్తుంది. 

అర్జునపత్రం అంటే మద్ధి ఆకు. వాత రోగాలను, కఫ రోగాలను నివారిస్తుంది. వ్రణాలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. 

అర్కపత్రం  దీనిని జిల్లేడు ఆకు అని కూడా అంటారు. వీటి వలన శిరో దోషాలు, విషాదోషాలు పోతాయి. 64 వ్యాధుల చికిత్సకు ఇవి ఉపయోగపడతాయనే వాదన ఉంది.              

0/Post a Comment/Comments

Previous Post Next Post