తెలంగాణాలో విద్యుత్ డిమాండ్ ఆల్ టైం రికార్డు స్థాయికి...


తెలంగాణలో విద్యుత్ డిమాండ్ అనూహ్యంగా పెరుగుతున్నది. మంగళవారం నాటి ఉదయం ఏడు గంటల 33 నిమిషాలకు ఇది 10,429 మెగావాట్లతో నూతన గరిష్ట స్థాయికి చేరినట్లు విద్యుత్ శాఖా మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్ ను అందిస్తున్నామని, ఈ స్థాయి వినియోగం తెలంగాణ అభివృద్ధికి ప్రతీక అని అన్నారు. 

తెలంగాణ విద్యుత్ వినియోగం ఉమ్మడి రాష్ట్రం మొత్తం కన్నా ఎక్కువగా ఈ స్థాయిలో పెరగటం నిజంగా ఆశ్చర్యకరమే. కాళేశ్వరంతో సహా మిగిలిన ఎత్తిపోతల పథకాలు ప్రారంభమైతే రానున్న సంవత్సరాలలో ఏ స్థాయిలో డిమాండ్ పెరగనుందో ఊహించటం కష్టం. ఇప్పటికే అంత పెద్ద రాష్ట్రమైన కర్ణాటక కన్నా తెలంగాణ ఎక్కువ విద్యుత్ ను వినియోగించుకుంటుంది. సోమవారం రోజు కర్ణాటకలో మొత్తం విద్యుత్ వినియోగం 190 మిలియన్ యూనిట్లు, ఆంధ్ర ప్రదేశ్ లో 185 మిలియన్ యూనిట్లు ఉండగా తెలంగాణాలో 218 మిలియన్ యూనిట్లుగా ఉంది. ఈ ఒక్కరోజే రాష్ట్రంలో 15 మిలియన్ యూనిట్ల సోలార్ విద్యుత్ వినియోగం జరిగింది. 

జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు మాట్లాడుతూ వినియోగంలో 30% పారిశ్రామిక, 30% గృహ, 30% వ్యవసాయ రంగాల నుండి వచ్చిన డిమాండ్ అని పేర్కొన్నారు. చత్తీస్ గఢ్ నుండి 2000 మెగావాట్ల తీసుకోవాలని అనుకున్నా కేవలం 1000 మెగావాట్లు మాత్రమే తీసుకున్నామని ఆయన తెలిపారు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post