విజయం సాధించే వరకు ఈ యాత్ర ఆగదు: జవదేకర్

విజయం సాధించే వరకు ఈ యాత్ర ఆగదు: జవదేకర్
తెలంగాణలో చేపట్టిన జన చైతన్య యాత్ర ఇప్పటితో ఆగిపోదని.. ఏడాది పాటు రాష్ట్రంలో విజయం సాధించే వరకు కొనసాగుతుందని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ పేర్కొన్నారు. బీజేపీ అధ్యక్షుడు డా. కె. లక్ష్మన్ చేపట్టిన జన చైతన్య యాత్ర మొదటి విడత ముగింపు సభలో భాగంగా తుంగతుర్తి లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలో పంచపాండవులైన.. బీజేపీ ఎమ్మెల్యేలు.. 100 మంది ఉన్న టీఆరెస్ కౌరవులతో యుద్ధం చేస్తే గెలుపు ఎవరిది ఆలోచించండి అంటూ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడారు. దేశంలో మోడీ అధికారంలోకి రావడంతో కుటుంబ పాల‌న‌కు స్వ‌స్తి ప‌లికార‌ని కానీ తెలంగాణ‌లో మాత్రం ఇంకా కుటుంబ పాల‌న సాగుతోందని దుయ్య‌బ‌ట్టారు.

గతంలో కమిషన్ ఇస్తే కానీ పనులు జరిగేవి లేవు.. కానీ మోడీ ప్రభుత్వం విజ‌న్‌తో క‌మిష‌న్ వ్య‌వ‌స్థ లేకుండా పారదర్శకంగా పని చేస్తుంది. కానీ తెలంగాణ‌లో ఇంకా క‌మిష‌న్ వ్య‌వ‌స్థ కొనసాగుతుందని అన్నారు. కేంద్రం నుంచి వ‌చ్చే నిధులు కూడా ప్ర‌జ‌ల‌కు చేర‌డంలేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. జన చైతన్య యాత్రలో భాగంగా.. 26 సభల్లో వచ్చిన ప్రజలను చూస్తే వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని నమ్మకం కలుగుతుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు.

తెలంగాణ అభివృద్ధికి క‌ట్టుబ‌డి ఉన్నాం

ఏ రాష్ట్రం అయినా, మేం అధికారంలో ఉన్నా లేకున్నా భేదం లేకుండా ప‌నిచేయాల‌నే ప్ర‌ధాని మోడీ సూచ‌న‌తో బీజేపీ ప‌నిచేస్తోంద‌ని చెప్పారు. అందులో భాగంగానే తెలంగాణ అభివృద్ధి చెందేందుకు స‌హ‌కారం అందిస్తున్నామ‌ని చెప్పారు. నేను మాన‌వ వ‌నరులు, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రిగా ఉండి తెలంగాణ నుంచి ఏ ఫైల్ వ‌చ్చినా వెంట‌నే అనుమ‌తులు ఇస్తూ ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని చూస్తున్నానని తెలిపారు. ఖ‌మ్మంలో ప‌వ‌ర్ ప్లాంట్ ఏర్పాటు కోసం రాష్టం నుంచి వ‌చ్చిన ఫైల్ ను కేవ‌లం 20 రోజుల్లోనే అనుమ‌తి ఇచ్చాన‌ని అన్నారు. తెలంగాణ‌లో 24 గంట‌ల క‌రెంట్ రావడానికి కూడా కేంద్రం తీసుకున్న నిర్ణ‌యాలేన‌ని తేల్చారు.

మాది రైతు ప్ర‌భుత్వం

రైతు క‌ళ్ల‌లో ఆనందం చూడటమే బీజేపీ ల‌క్ష్యం అని జ‌వ‌దేక‌ర్ చెప్పారు. ఇందులో భాగంగానే ప్రధాని మోడీ రైతుల కోసం 14 పంటల మద్దతు ధర పెంచార‌ని అన్నారు. గ‌త 50  ఏళ్లుగా రైతులు కంటున్న మ‌ద్ద‌తు ధ‌ర‌ కల సాకారం కావడానికి మోడీ కృషి చేశారన్నారు. ఈ మద్దతు ధర కోసం ఎన్నో ఏళ్లుగా రైతులు పోరాటాలు చేసి తుపాకీ తూటాలకు ఎదురువెళ్లిన రోజులు ఉన్నాయ‌ని గుర్తు చేశారు. రైతు కష్టాలు తెలిసిన ప్రధాని ఉన్నారు కాబట్టే.. 50 ఏళ్ళలో ఏ ప్రభుత్వం చేయని పని మోడీ చేసి చూపించార‌ని అన్నారు.

కాంగ్రెస్ హ‌యాంలో రాజీవ్ గాంధీ ప్రభుత్వం 100 రూపాయలు పంపిస్తే.. ప్రజల వద్దకు 15 రూపాయలు చేరేవి ... కానీ మోడీ వచ్చాక 100 రూపాయలకు 100 చేరిపోతున్నాయి.. ఇదే కాంగ్రెస్ కు.. బీజేపీకి ఉన్న తేడా అని స‌మ‌ర్థించుకున్నారు. కట్టెల పొయ్యిపై వండుకునే 2000 మందికి తుంగతుర్తి లో ఉజ్వల పథకం క్రింద గ్యాస్ కనెక్షన్లు రావ‌డానికి కూడా మోదీ తీసుకున్న నిర్ణ‌యమే కార‌ణం అన్నారు. ఎస్సీ ఎస్టీల‌కు కార్పొరేషన్ ఉన్నట్లుగా బీసీలకు కూడా క‌మిషన్‌ ఉండాల‌ని లోక్ స‌భ‌లో ఆమోదిస్తే.. కొంతమంది దాన్ని రాజ్యసభ లో అడ్డుకున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కానీ వ‌చ్చే బ‌డ్జట్‌లో క‌చ్చితంగా ఆమోదింప జేస్తామ‌ని బీసీలు ఎటువంటి అపోహ‌లు పెట్టుకోవ‌ద్ద‌ని సూచించారు. మోదీ అభివృద్ది చూసి ఎక్కడ ఎన్నికలు వచ్చినా.. బీజేపీ గెలుస్తోంది. మోడీ అధికారంలోకి రాక ముందు 6 రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉండేది.. కానీ మోడీ వచ్చాక 20 రాష్ట్రాలలో విజయం సాధించాం. అని అన్నారు. 

టీడీపీ వెన్నుపోటు పొడిచింది

గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో మిత్రులుగా ఉన్న టీడీపీ త‌మ‌కు వెన్నుపోటు పొడిచిందని మండి ప‌డ్డారు. మేం టీడీపీతో స్నేహంగా ఉన్నాం కానీ వాళ్లే మాకు వెన్నుపోటు పొడిచారు. ఇకముందు కూడా పొడుస్తారు అంటూ విమ‌ర్శ‌లు చేశారు. మిత్ర బంధంలో భాగంగానే గత ఎన్నికల్లో సూర్యాపేట లో సంకినేని వెంకటేశ్వ‌ర్‌ రావుకు టికెట్ ఇవ్వలేకపోయాం కానీ వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఘన విజయం సాధిస్తారు అని ధీమా వ్య‌క్తం చేశారు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post