వట సావిత్రి వ్రత కథ

వట సావిత్రి వ్రత కథ
మద్ర దేశానికి రాజైన అశ్వపతి సంతానం కోసం పదునెనిమిది సంవత్సరాల పాటు సావిత్రీదేవిని ఆరాధించాడు. అతని అకుంఠిత దీక్షకు మెచ్చిన సావిత్రీ మాత ప్రత్యక్ష్యమై అతన్ని అనుగ్రహించగానే, అశ్వపతి సావిత్రి అంతటి పుత్రికను వరంగా కోరుకుంటాడు. అతని భక్తికి మెచ్చిన దేవి, తన వర ప్రసాదమైన ఆ పుత్రిక వల్ల అశ్వపతికి ఎనలేని కీర్తితో పాటు నూరుగురు పుత్రులు కలుగుతారని అనుగ్రహించింది.

అశ్వపతి ఆ వరప్రభావంతో కలిగిన బిడ్డకు సావిత్రి అని పేరు పెట్టి అతి గారాబంగా పెంచసాగాడు. యుక్త వయస్కురాలైన సావిత్రి సాళ్వరాజ వంశజుడైన సత్యవంతుని గుణగణాదులు విని అతన్నే తన భర్తగా చేసుకోవాలని నిశ్చయించుకుంటుంది.

సత్యవంతుని అసలుపేరు జితాశ్వుడు. కానీ, ఎల్లప్పుడూ సత్యాన్నే పలకడం వల్ల సత్యవంతుడనే పేరుతో ప్రఖ్యాతి పొందుతాడు. అతని తండ్రి ద్యుమక్సేనుడు రాజ్యాన్ని, కంటిచూపునూ పోగొట్టుకొని భార్యా సమేతుడై అరణ్యంలో ఆశ్రమ జీవితం కొనసాగిస్తూ, ఒక్కగానొక్క కుమారుడైన సత్యవంతుని పైనే ఆశలు పెట్టుకుని జీవిస్తున్నాడు. నారదుని ద్వారా వివరాలు విన్న సావిత్రి, సత్యవంతునితో వివాహం జరిపించమని వేడుకుంటుంది. నారదుడు సత్యవంతుని ఆయుః ప్రమాణం మరొక్క సంవత్సర కాలమేనని, అటువంటి అల్పాయుష్కున్ని వరించవద్దని చెబుతాడు. కానీ దృఢచిత్తయై సావిత్రి, విధిని తన మనోబలంతో ఎదుర్కొనగలనని చెప్పి మార్గాంతరం చూపమని నారదున్ని ప్రార్థిస్తుంది. నారదుడు ఆమెకు బాలా త్రిపురసుందరి త్రిరాత్ర వ్రతాన్ని బోధించిన తరువాత ఆమె తండ్రిని సంప్రదించి, సావిత్రీ సత్యవంతుల వివాహం జరిపించి వెళ్ళిపోయాడు.

మద్ర దేశపు రాకుమారిగా అతి గారాబంగా పెరిగిన సావిత్రి, అతి సామాన్యమైన ఇల్లాలుగా, నిరాడంబరంగా, ప్రశాంతమైన ఆశ్రమవాసంలో జీవితాన్ని గడపడం ప్రారంభించింది. అత్తా మామలను జాగ్రత్తగా చూసుకుంటూ, భర్తతో అనురాగంలో మునిగి తేలుతున్నా, మనసులో నారదుని మాటలు మననం  చేసుకుంటూనే ఉంటుంది. మహర్షి చెప్పిన కాలానికి నాలుగు రోజుల ముందుగా సావిత్రి బాలా త్రిపుర సుందరి త్రిరాత్ర వ్రతాన్ని ప్రారంభిస్తుంది. కఠోర దీక్షతో ఆ వ్రతాన్ని నియమబద్ధంగా పూర్తి చేస్తుంది.

నాలుగవ నాడు ఉదయాన్నే శుచిగా అడవిలో లభించే అలసందలు, బెల్లం కలిపిన అట్లు తయారు చేసి, వెన్న ముద్ద తో పాటు అమ్మవారికి నివేదిస్తుంది. తరువాత అడవిలో ముత్తైదువులు ఎవరూ దొరక్క పోవటంతో మఱ్ఱి చెట్టునే ముత్తయిదువుగా భావించి,  చెట్టుకే చీర, రవికలు పెట్టి 108 మార్లు నూలు దారంతో చెట్టు చుట్టూ చుట్లు వేస్తుంది. పిమ్మట భర్తకు భోజనం పెట్టి, తాను కూడా భుజించి వ్రత సమాప్తి చేస్తుంది.

నారదుడు చెప్పిన గడువు రోజున యథాప్రకారం భర్త గొడ్డలితో అడవిలోకి బయలుదేరగానే తాను కూడా భర్తతో పాటు నడవసాగింది. భర్త వెంటే నడుస్తున్న సావిత్రి, అతను చూపుతున్న వింతలు చూస్తూ, చెపుతున్న విశేషాలు వింటున్నా ఆమె సర్వేంద్రియాలు భర్త పైనే కేంద్రీకరించి ఉంచింది. కాసేపయ్యాక ఆ దుర్ఘడియ రానే వచ్చింది. నడిచి నడిచి అలసిన భర్తను తన వడిలో పడుకోబెట్టుకుంది సావిత్రి. మరుక్షణమే నిద్రలోకి జారిపోయాడు సత్యవంతుడు. ఇంతలో మహిషువు ఘంటలు గణగణమని మోగగా, పాశ హస్తుడై భీకరాకారంతో వచ్చిన కాలయముడు సత్యవంతునిలోని జీవుని చెరపట్టి లాగాడు. త్రిరాత్ర వ్రతం చేసిన ఫలము వల్ల ఎవరికీ కనిపించని ఆ భీకర దృశ్యాలు సైతం ఆ సావిత్రికి కనిపించసాగాయి. 

సావిత్రి తన భర్త జీవాన్ని తీసుకెళుతున్న యమున్ని అడ్డుకుంది. తనను చూసి కూడా చలించని ఆమెతో యముడు "నేటితో నీకు, నీ భర్తకు మధ్య ఋణం తీరింది. నీ భర్తకు జరిపించవలసిన సంస్కారాలు జరిపి నీ దోవన నీవు వెళ్ళు" అని మరలిపోయాడు.

విగతజీవుడైన తన భర్త శవాన్ని చెట్టుచాటున దాచి, సావిత్రి యమున్ని అనుసరించింది. ఎవరో అనుసరిస్తున్నారని తిరిగి చూసిన యముడు "నీ ధైర్యానికి మెచ్చి నీ భర్త ప్రాణం తప్ప ఏదైనా వరమిస్తాను కోరుకో" అన్నాడు. ఆ ఇల్లాలు అత్తవారింటి క్షేమం కోరి తన అత్తమామలకు చూపుతో పాటు, పోగొట్టుకున్న రాజ్యాన్ని కూడా ప్రసాదించమని కోరింది. యముడు ఆ వరాన్ని ప్రసాదించినా సావిత్రి ఆయనను అనుసరించటం మానలేదు. అప్పుడు యముడు "అమ్మా, మొండితనం మాని మరలిపో. అలాగే మరొక్క వరం. అది కూడా నీ భర్త ప్రాణాలు తప్ప" అని అనగానే సావిత్రి తన పుట్టింటికి వారసులు కావాలని కోరింది. ఆమె కోరిక మన్నించి అశ్వపతికి నూరుగురు పుత్రులను అనుగ్రహించాడు యముడు.

అయినప్పటికీ సావిత్రి పట్టు వీడక యమున్ని అనుసరిస్తూ "స్వామీ, ఏడడుగులు నడిస్తే అపరిచితులు కూడా బంధువులవుతారు కదా. మనిద్దరం అంతకన్నా ఎక్కువ నడవడం వల్ల ఆత్మబంధువులయ్యాము కదా" అని అన్నది. దానికి యముడు "సావిత్రి, నీ మాటలు నన్ను సంతోష పరిచాయి. మరొక్క వరమిస్తాను అడుగు" అన్నాడు.

"స్వామీ, మీరు ఈసారి ఎట్టి నిబంధనలు విధించలేదు కాబట్టి నా సౌభాగ్యాన్ని నాకు ప్రసాదించమని" వినమ్రంగా చేతులు జోడించి కోరింది. యముడు ఆమె వినయ విధేయతలనూ, సమయస్ఫూర్తిని మెచ్చుకుని సత్యవంతుని పునర్జీవితుడిని చేసి వారిద్దరినీ దీవించాడు.

ఇదీ వట సావిత్రి వ్రత కథ. 

0/Post a Comment/Comments

Previous Post Next Post