సంకట హర చతుర్థి

సంకట హర చతుర్థి
సంకట హర చతుర్థి 
సర్వ సంకటములు తొలగింపబడటానికి ఆచరించేదే 'సంకటహరవ్రతం'. చవితి రోజు దీనిని చేసుకుంటారు కాబట్టి సంకట హర చతుర్థి అనే పేరు కూడా ఉంది. వ్యావహారికంలో దీనిని సంకష్టి అని, సంకట చవితి అని కూడా అనటం కద్దు.

గణపతి విఘ్నాలను కలిగించే దేవుడనీ, ప్రతి పనిలోనూ ముందుగా ఆయనను పూజిస్తే మాత్రం విఘ్నాలను కలిగించడనే భావన కొందరిలో ఉంది. కానీ ఆ భావన సరికాదు. చెడు పనులకు విఘ్నాలను కలిగించి, మంచిపనులు నిరాటంకంగా సాగింపచేసే దైవమే గణపతి. ఏదైనా పనికి అనుకోని ఇబ్బందులు ఎదురవుతుంటే, ఈ వ్రతాన్ని ఆచరించటం వలన అవన్నీ తొలగిపోతాయని విశ్వసిస్తారు.

సంకట హర చతుర్థి వ్రతాన్ని ఎప్పుడు ఆచరించాలి?

సంకట హర వ్రతాన్ని ప్రతీ నెలా ఆచరించవచ్చు. కృష్ణ పక్షములో వచ్చే చవితి రోజున ఈ వ్రతాన్ని ఆచరించాలి. అంటే పౌర్ణమి తర్వాత 3-4 రోజులకు సంకట హర చతుర్థి వస్తుంది.

సూర్యాస్తమయ అంటే ప్రదోష కాలములో ఏ రోజున అయితే చవితి ఉంటుందో ఆ రోజున సంకట హర చతుర్థిని ఆచరించాలి. చాలా అరుదుగా వరుసగా రెండు రోజులపాటు ప్రదోష సమయంలో చవితి ఉంటుంది. అలాంటప్పుడు రెండవ రోజును మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. ఇటీవల కాలంలో పంచాంగంలోనూ, క్యాలెండర్లలోనూ సంకట హర చవితి వ్రత తేదీలు తెలుపబడుతున్నాయి. మేము ఇకనుండి ఇక్కడ కూడా తెలియచేయనున్నాము. అవకాశాన్ని బట్టి 3, 5, 9, 11, 21 నెలల పాటు ఈ వ్రతాన్ని ఆచరించాలి.

సంకట హర చతుర్థి వ్రతాన్ని ఎలా ఆచరించాలి?

సంకట హర చతుర్థి వ్రతాన్ని నెలలో కృష్ణ పక్ష చవితి రోజున ప్రారంభించాలి. ఈ వ్రతాన్ని ఆచరించేవారు ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేసుకుని, ఆ తరువాత తలంటు స్నానాన్ని చేయాలి. ఇంటిలో దేవుని గదిలోనో, లేక మరొక అనుకూలమైన చోటనో పీట వేసి దానిపై ముగ్గును వేయాలి. పీటపై గణపతి విగ్రహాన్ని గానీ, చిత్ర పటాన్ని గానీ నెలకొల్పుకోవాలి. తరువాత చిన్న పళ్ళెములో బియ్యాన్ని పోయాలి. అనంతరం పసుపు ముద్దతో మహా గణపతిని చేసుకుని ఒక తమలపాకుపై ఆ గణపతిని ఉంచాలి. తరువాత తమలపాకు కొన తూర్పు వైపునకు గానీ, ఉత్తరం వైపునకు గానీ ఉండేటట్లుగా పళ్లెంలో బియ్యంపై ఉంచి నిర్విఘ్నంగా వ్రతం పూర్తయ్యేందుకు పసుపు గణపతి పూజను చేయాలి.

ఆ తరువాత ఎర్రని లేదా తెల్లని జాకెట్ గుడ్డను తీసుకుని, దానికి నాలుగు వైపులా పసుపును పూయాలి. అనంతరం ఆ వస్త్రాన్ని స్వామి ముందు పరచి, అనుకున్న కోరికను నెరవేర్చమని ప్రార్థించాలి.  స్వామిని తలచుకొని మూడు దోసిళ్ళ బియ్యాన్ని వస్త్రంపై వెయ్యాలి. అదే విధంగా రెండు ఖర్జూరాలు, రెండు వక్కలు, దక్షిణ ఉంచిన తాంబూలాన్ని బియ్యంలో ఉంచి మూటగా కట్టాలి.

తరువాత విధి విధానంగా గణపతి పూజ చెయ్యాలి.

సూర్యాస్తమయం తరువాత, తిరిగి స్నానం చేసి గణపతి ముందు దీపారాధనను చేయాలి. వీలైన వారు, వారికి వచ్చిన గణపతి స్తోత్రములు చదవాలి.


సంకట హర చతుర్థి వ్రత నియమాలు 
  • వ్రతం చేసిన రోజు సూర్యాస్తమయం అయ్యేవరకూ ఉప్పు కలిపిన పదార్థాల్ని, ఉడికిన పదార్థాల్ని తీసుకోకూడదు. అయితే పాలు. పండ్లు మాత్రం తీసుకోవచ్చు. 
  • సాయంకాలం పూజ పూర్తయిన తరువాత చంద్ర దర్శనం / నక్షత్ర దర్శనం చేసి మామూలు భోజనాన్ని చేయవచ్చు. 
అనుకున్నన్ని నెలలు పూర్తయిన తరువాత ముడుపు కట్టిన బియ్యాన్ని, తీపి పొంగలి / పరమాన్నంగా చేసి గణపతికి నివేదించి వ్రతాన్ని పూర్తి చేయాలి. ఈ వ్రతం వలన కోరుకున్న పనిలో సంకటములన్నీ తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post