చంద్రబాబు నాయుడుకు డబ్బు, పదవి మీద ఆశ చావలేదు

చంద్రబాబు నాయుడుకు డబ్బు, పదవి మీద ఆశ
రాబోయే 2019 ఎన్నికలు ఆంధ్ర ప్రదేశ్ భవిష్యత్తులో కీలక పాత్ర నిర్వహిస్తాయని, జనసేన బరిలోకి దిగుతుండటంతో రాజకీయాల్లో పెను మార్పులు రానున్నాయని పవన్ కళ్యాణ్ అన్నారు. ఆదివారం విశాఖపట్నంలో ఎస్. కన్వెన్షన్ సెంటర్‌లో వివిధ పార్టీల నేతలను, కార్యకర్తలను ఆయన జనసేన పార్టీలో చేర్చుకున్నారు. 

ఈ  సందర్భంగా  పవన్ ప్రసంగిస్తూ, 2014 లో నమ్మి, ప్రజలతో ఓట్లు వేయించి, తెలుగు దేశం పార్టీని గెలిపిస్తే ప్రజలకు ఏమీ చేయలేదని అన్నారు. ఈ వయసులో కూడా చంద్రబాబు నాయుడుకు డబ్బు, పదవి మీద ఆశ చావలేదని విమర్శించారు. ఉత్తరాంధ్రలో ఎన్నో సమస్యలున్నాయని ఏకరువు పెట్టారు. 

లోకేష్ గెలుస్తాడని చంద్రబాబుకు నమ్మకం లేకే, దొడ్డిదారిన ఎమ్మెల్సీ చేసి మంత్రిని చేయాల్సి వచ్చిందని ఎద్దేవా చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థిగా లోకేష్‌ను మన మీద రుద్దడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. దమ్ముంటే లోకేశ్‌ తన మంత్రి పదవికి రాజీనామా చేసి, ప్రత్యక్ష్య ఎన్నికల్లో పోటీ చేయాలని సవాల్‌ విసిరారు. జనసేన నుండి కార్యకర్తను నిలబెడతామని, ఎవరు గెలుస్తారో చూద్దామని పవన్‌ అన్నారు. ఇచ్ఛాపురం నుండి అనంతపురం వరకు ఏ విషయంపైన అయినా చర్చకు తాను సిద్ధమని, తనతో లోకేశ్‌ బహిరంగ చర్చకు రావాలని పవన్‌ కోరారు.

ఈ సందర్భంగా జనసేన ఫ్లెక్సీలు కడుతూ విద్యుత్‌ షాక్‌తో మృతి చెందిన ఇద్దరు కార్యకర్తల కుటుంబాలకు పవన్‌ ఆర్థిక సాయం అందించారు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post