ఇది టీడీపీకి విజయమే అయినా....

ఇది టీడీపీకి విజయమే అయినా....
అవిశ్వాస తీర్మానం.... పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాలప్పటి నుండి రోజూ వింటున్న పదం.  బడ్జెట్ సమావేశాలప్పుడు టిడిపి, వైసిపిలు దాదాపుగా ప్రతి రోజూ స్పీకర్ కు అవిశ్వాస తీర్మానాలు అందజేసాయి. కానీ అన్నాడీఎంకే సభ్యుల గొడవ మూలంగా చర్చ చేపట్టలేదు. బిజెపి ఆ సమయంలో అవిశ్వాసాన్ని ఎదుర్కొనడం ఇష్టం లేక  అన్నాడీఎంకేను అడ్డుపెట్టుకుని అప్పటికి ఈ సమస్యను వాయిదా వేసింది. ఇప్పుడు వర్షాకాల సమావేశాల మొదటి రోజునే అవిశ్వాస తీర్మానం కోసం అందిన నోటీసును ఆమోదించి 20వ తేదీన చర్చను చేపట్టనుంది. అంటే ఈసారి ప్రత్యేక హోదా పై జరిగే చర్చకు అధికార బిజెపి ముందే సన్నద్ధమై ఉన్నదనే భావించాలి. 

ప్రత్యేక హోదా విషయంపై వైసిపి ఎంపీలు రాజీనామా చేయటంతో, కేంద్ర ప్రభుత్వం పై అవిశ్వాసం పెట్టడం టిడిపి సాధించిన విజయంగానే పేర్కొనవచ్చు. దీని ద్వారా టిడిపికి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రత్యేక హోదాపై విమర్శించే, వారినుండి అధికారికంగా సమాధానం రాబట్టే అవకాశం వచ్చింది. తెలుగు దేశం పార్టీ ఎంత వరకు దీనిని ఉపయోగించుకోగలదో చూడాలి. 

ఈ చర్చలో వెంకయ్య నాయుడు, బిజెపి మేనిఫెస్టో, మోడీ తిరుపతి వాగ్దానం మరియు చంద్రబాబు ప్యాకేజీ /హోదా  మాట మార్చటాలు ప్రతీది చర్చకొచ్చే అవకాశం ఉంది. చంద్రబాబు, కేంద్రానికి ప్యాకేజీ గురించి గానీ, హోదా గురించి గానీ అప్పట్లో ఏమైనా అధికారికంగా స్పందించి ఉంటే మాత్రం ఆయన ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. కాంగ్రెస్ కు ఈ చర్చ లాభించే అవకాశం ఉంది. ఏమాత్రం అవకాశం వచ్చినా అది ఈ రెండు పార్టీలను ఎండగట్టే అవకాశం ఉంది. 

వైఎస్ఆర్ కాంగ్రెస్ కు మాత్రం ఇది కోల్పోయిన సువర్ణావకాశమే. ఇప్పటికే ఈ పార్టీ ఎంపీలు రాజీనామా చేయటంతో బిజెపి, టిడిపి కుమ్మక్కయ్యాయి, లేకపోతే కాంగ్రెస్ టిడిపి కుమ్మక్కయ్యాయి అని ఆరోపించటం మినహా చేయగలిగింది ఏమీ లేదు. 

ఏది ఏమైనా రాజకీయ పార్టీల లాభ నష్టాలను వదిలేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రం ఇది సంతోషకరమైన విషయమే. హోదాపై ఎవరేం మాట్లాడతారో, ఎవరి ఉద్దేశ్యాలేమిటో స్పష్టంగా బహిర్గతమయ్యే అవకాశం ఉంది.  

0/Post a Comment/Comments

Previous Post Next Post