నవ కళేబరోత్సవం

నవ కళేబరోత్సవం
పూరి జగన్నాథాలయంలో జగన్నాథుడితోపాటు బలభద్ర, సుభద్రల విగ్రహాలు కూడా చెక్క తో చేసినవే. కొన్ని సంవత్సరముల కొకసారి పాత విగ్రహాల స్థానంలో, కొత్త విగ్రహాలను తయారు చేసి  ఆలయంలో అమరుస్తారు. అధిక ఆషాఢ మాసం వచ్చిన సందర్భంలోనే ఇలా చేస్తారు.

19వ శతాబ్దం నుండి ఇప్పటి వరకు 1912, 1920, 1931, 1950, 1969, 1977, 1996 మరియు 2015వ సంవత్సరాలలో ఈ వేడుక జరిగింది. సాధారణంగా ఈ వేడుక 8, 11, 19 సంవత్సరాలకోసారి వస్తుంది. క్రీ.శ.1039 లో మాత్రం 27 సంవత్సరాల వ్యవధి తీసుకుంది. 

జగన్నాథ, బలభద్ర, సుభద్రల కొత్త చెక్క విగ్రహాలను తయారు చేసే సమయంలో ఆయా విగ్రహాల నాభి భాగంలో ఇంతవరకూ ఎవరూ చూడని తత్త్వ పదార్ధం అనే ఒక పదార్థాన్ని ఉంచుతారు. అలా తత్త్వ పదార్ధాన్ని విగ్రహంలో ప్రతిష్ఠించడాన్నే నవ కళేబరోత్సవం అంటారు. ఈ ప్రక్రియ కృష్ణ చతుర్దశి రోజు అర్ధరాత్రి అత్యంత గోప్యంగా జరుగుతుంది. ఈ తత్త్వ పదార్థాన్ని బ్రహ్మ పదార్థం అని కూడా అంటారు. ఈ ప్రక్రియకు బ్రహ్మపరివర్తన వేడుక అనే మరొక పేరు కూడా ఉంది. 

జీర్ణబేర పరిత్యాగ

ఆత్మ జీర్ణించిన శరీరాన్ని విడిచిపెట్టి కొత్త శరీరాన్ని ఎంచుకునే విధంగానే , పూరిలోని జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనుల జీర్ణించిన విగ్రహాలను తొలగించి ఆ స్థానంలో కొత్త విగ్రహాలను ఏర్పాటు చేస్తారు.  అనాది కాలం నుండి ఇది ఆచారంగా వస్తుంది. అయితే కొత్త విగ్రహాలను తయారు చేయటం అనేది ఆచారపరంగా సంక్లిష్టమైన విధానము. 

వనయాగయాత్ర

నవ కళేబర యాత్రలో ప్రధాన ఘట్టం వనయాగయాత్ర. నూతన దేవతా విగ్రహాల తయారీకి అవసరమైన దారు (చెట్లను) అన్వేషించడమే ఈ యాత్ర లక్ష్యం. జగన్నాథుని రథయాత్రకు సరిగ్గా 65 రోజుల ముందు,  దశమినాడు వనయాగయాత్ర మొదలుపెడతారు. దైతాపతులు, బ్రాహ్మణులు, విశ్వకర్మలు అందరూ కలసి ఇందుకో ముహూర్త సమయాన్ని నిర్ణయిస్తారు. అనంతరం నలుగురు ప్రధాన దైతాపతులు ఒక్కొక్కరుగా బలభద్రుడు, జగన్నాథుడు, సుభద్ర, చివరగా సుదర్శనుని వద్దకు వెళ్లి 'ఆజ్ఞామాల' తెచ్చుకుంటారు. అనంతరం, వీరికి జయ విజయుల మండపం దగ్గర కొత్తబట్టలు పెడతారు. దారు అన్వేషణ కార్యభారమూ అక్కడే అప్పగిస్తారు. ఈ బృందం మంగళ వాద్యాలతో బయల్దేరి ఆలయం వెలుపలికి వస్తుంది. అక్కడి నుంచే యాత్ర మొదలవుతుంది. 

పూరీ గజపతి మహరాజ్‌ దివ్యసింగ్‌దేవ్‌ శ్రీనహర్‌ దైతాపతులకు దుస్తులు, తాంబూలం అందించి, యాత్రకు అనుమతిస్తాడు. ప్రయాణమంతా ఎడ్ల బండ్ల మీదో కాలినడకనో సాగుతుంది. రెండో రోజు పూరీ పట్టణానికి ఈశాన్య ప్రాంతంలోని మంగళాదేవి ఆలయానికి చేరుకుంటారు. దేవి అనుగ్రహం అందితేనే దారు లభిస్తుందని విశ్వాసం. ఆ రాత్రి అక్కడే బస చేస్తారు. దైతాపతుల దళపతికి అమ్మవారు కలలో కనిపించి విగ్రహాల తయారీకి అవసరమైన దారు ఎక్కడ దొరుకుతుందో ప్రతీకాత్మకంగా చెబుతుంది. ఆ ప్రకారం, రెండొందల మంది దైతాపతులు కలప అన్వేషణకు బయల్దేరతారు. 

వంశ పారంపర్యంగా కొత్త విగ్రహాలను తయారు చేస్తున్న దైతాపతులు , విశ్వకర్మల బృందం ఎన్నో నియమ నిబంధనలను పాటిస్తూ దేవతా మూర్తుల విగ్రహాలను తయారు చేసే దారు (చెక్క దుంగలకు అవసరమైన చెట్ల) కోసం అన్వేషణ ప్రారంభిస్తుంది. ఆ చెక్కను సేకరించే చెట్టు కొన్ని ప్రత్యేకమైన లక్షణాలను కలిగి వుండాలి.

ఆ చెట్ల కుండవలసిన లక్షణాలు

పురాతనమైన వేపచెట్టునే దారు వృక్షంగా ఎంచుకుంటారు. దారు ఎంపికలో చాలా అంశాల్ని పరిశీలిస్తారు. ఊరికి వెలుపలా, నదికీ, స్మశానానికి దగ్గర్లో ఆ చెట్టు ఉండాలి. ఇతర వృక్షాల కొమ్మలు ఈ చెట్టుతో కలవకూడదు. చెట్టుకు గాయం గానీ , కాలిన గుర్తులు గానీ ఉండకూడదు. మొదలు 10-12 అడుగులు వంకర లేకుండా ఉండాలి. చెట్టుకి తొర్రలు గానీ, చెట్టు పైన పక్షుల నివాసం గానీ ఉండకూడదు. వృక్షం సమీపంలో పాము పుట్ట ఉండాలి. 

వృక్ష శాఖలు, రంగు దారు ఎంపికలో ప్రధాన పాత్ర వహిస్తాయి. బలభద్రుని దారు, సుదర్శనుని దారు ఎరుపు రంగులో, సుభద్ర దారు ఆకుపచ్చని రంగులో కానీ పసుపు రంగులో కానీ ఉండాలి. జగన్నాథుని దారు మాత్రం కృష్ణ (నల్లని) వర్ణంలో ఉండాలి. సుదర్శనుని దారుకు మూడు ప్రధాన శాఖలు ఉండాలి, గద గుర్తు కనిపించాలి. బలభద్రునికి ఏడు శాఖలూ నాగలి గుర్తు, సుభద్రకు ఏడు శాఖలూ పద్మం గుర్తు, జగన్నాథునికి నాలుగు శాఖలూ, శంఖ చక్రాల గుర్తులుండాలి.

మొదటి విడతలో, ఇలాంటి లక్షణాలున్న 105 చెట్లను గుర్తిస్తారు. దైతాపతులు పరిశీలించి, అందులోంచి పదిహేను చెట్లను మాత్రమే ఎంపికచేస్తారు. ఆ తర్వాత అందులోంచి నాలుగు వృక్షాల్ని ఖరారుచేస్తారు. మొదటగా సుదర్శనుని వృక్షాన్నీ, అనంతరం బలభద్రుడు, సుభద్ర, చివరన జగన్నాథుని దారు వృక్షాలనూ ప్రకటిస్తారు. 

విగ్రహాలను చెక్కే దారు (వేప) వృక్షాలను ఎంపిక చేసిన తర్వాత బ్రాహ్మణులు, విశ్వకర్మలు ఆయా చెట్ల దగ్గరే తాటాకు కుటీరాలు వేసుకుని మూడు రోజులపాటు యజ్ఞం చేస్తారు. ముందుగా బంగారు, వెండి గొడ్డళ్ళను ఆయా చెట్లకు తాకించిన తర్వాత ఇనుప గొడ్డలితో చెట్లను నరికి అందులోనుండి అవసరమైన దుంగలను తీసుకుని మిగతా చెట్టును పాతిపెట్టేస్తారు. ఆ దుంగలను చింత, పనస, రావి కలపలతో తయారు చేసిన బండిలో పూరి వరకు సంప్రదాయ బద్ధంగా భక్తి శ్రద్ధలతో పూరీ దేవాలయం లోని కైవల్య మందిరానికి  తరలిస్తారు. 

విగ్రహ తయారీ 

ఈ నవ కళేబరోత్సవం ప్రక్రియ మరియు విగ్రహాల తయారీ విధానము  తాటియాకు పత్రాలపై వ్రాసి దేవాలయం లో భద్రపర్చబడి ఉంది. వాటిలో సూచించిన కొలతలు మరియు నియమ నిబంధనల కనుగుణంగా విగ్రహాలు తయారు చేస్తారు. 

రథయాత్రకు సరిగ్గా 45 రోజుల ముందు విగ్రహాలు చెక్కడం ప్రారంభిస్తారు. విగ్రహాల తయారీ, రంగులు అద్దడం పూర్తయిన తర్వాత విగ్రహాల నాభి స్థానంలో తత్త్వ పదార్ధం  ఉంచే రహస్యమైన ప్రక్రియను చేపడతారు. 

నవ కళేబరోత్సవం 

అసలు తత్త్వ పదార్థం ఎలా ఉంటుందో ఇప్పటివరకు ఎవరూ చూసి ఉండరు. తర తరాలుగా ఈ పదార్థాన్ని జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనుల విగ్రహాల నాభిలో ఉంచే ప్రక్రియ అతి రహస్యంగా జరుగుతూ వస్తోంది. కృష్ణుడి పుట్టిన రోజుగా భావించే కృష్ణ చతుర్దశి నాడు ఈ తత్త్వ పదార్ధ మార్పిడి ప్రక్రియని శ్రీ మందిరంలో నిర్వహిస్తారు.     

ఈ ప్రక్రియ జరిపే సమయంలో దేవాలయం నుండి అందరినీ బయటకు పంపేస్తారు. జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనుల కొత్త విగ్రహాలను, పూజలు అందుకుంటున్న పాత విగ్రహాల ముందు వుంచుతారు. ఈ తత్త్వ పదార్ధం మార్చే అవకాశం దక్కిన నలుగురు దైతాధిపతుల కళ్ళకు ఏడు పొరలుగా పట్టు వస్త్రాలను కడతారు. ఆ పదార్థాన్ని చేతితో తాకకుండా చేతికి కూడా వస్త్రం చుడతారు. ఆ తర్వాత పూరి పట్టణం మొత్తానికి విద్యుత్ ను ఆపివేస్తారు. గర్భగుడిలో కూడా కటిక చీకటిగా వుండేలా చేసి వీరిని గర్భగుడిలోకి పంపిస్తారు. ఆ చీకటిలోనే వారు నాభి స్థానంలో ఉండే ఆ తత్త్వ /బ్రహ్మ పదార్థాన్ని పాత విగ్రహాల నుండి తీసి కొత్త విగ్రహాలకు అమరుస్తారు. నాభి ప్రాంతంలో ఆ పదార్థం చేరగానే దేవతా మూర్తులకు నవకళేబరం ప్రాప్తించినట్టు భావిస్తారు. నవ కళేబరోత్సవం పూర్తికాగానే పాత విగ్రహాలను శాస్త్రోక్తంగా భూస్థాపితం చేసి కర్మకాండలు నిర్వహిస్తారు.

రథయాత్రకు రెండు రోజుల ముందు కొత్త విగ్రహాల నేత్రోత్సవం జరుగుతుంది. అప్పటినుండి అన్ని పూజలు యధావిధిగా జరుగుతాయి. ఆ మర్నాడు నవయవ్వన దర్శనం జరపుతారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post