Telugu News

Latest Post

బీజేపీతో పోరాడుతాడని 2015 బీహార్ ఎన్నికలలో ముస్లింలు నితీష్ కుమార్ కు ఓటు వేస్తే ఆయన మోసం చేశారని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసి ఆరోపించారు.  ప్రధాన మంత్రి అభ్యర్థిగా ఉండవలసిన నితీష్ కుమార్, ఇప్పుడు ప్రధానమంత్రి ఒడిలో కూర్చున్నాడని విలేఖరుల సమావేశంలో ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన వ్యాఖ్యానించారు. 

బీహార్లో 2015 అసెంబ్లీ ఎన్నికలలో భారీ విజయాన్ని సాధించిన జెడి (యు), ఆర్జెడి, కాంగ్రెస్ లతో కూడిన గ్రాండ్ అలయెన్స్ కు నితీష్ కుమార్ తిరిగి వస్తారా అన్న ప్రశ్నకు అది ఊహ జనితమని చెప్పి సమాధానమిచ్చేందుకు ఒవైసి నిరాకరించారు.

జూన్ నెలలో  టోకు ధరల ద్రవ్యోల్బణం 5.77
టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం జూన్ నెలలో  5.77 శాతానికి చేరినట్లు సోమవారం విడుదల చేసిన అధికారిక గణాంకాలు వెల్లడించాయి. డిసెంబరు 2013 తర్వాత ఇదే అత్యధికం.  ఇంధనం ధరలు పెరగటం వలన ఇలా జరిగింది. జూన్ నెలలో టోకు ధరల సూచి (డబ్ల్యుపిఐ) వృద్ధి 4.43 శాతంగా నమోదయింది. గత ఏడాది జూన్ నెలలో ఇది కేవలం 0.9 శాతంగా నమోదైంది.

ఇండెక్స్ లోని  ప్రాధమిక వస్తువుల విభాగంలో ద్రవ్యోల్బణం మే నెలలో 3.16 శాతం నుంచి జూన్ నెలలో 5.3 శాతానికి పెరిగింది, అయితే ఆహార ద్రవ్యోల్బణం మాత్రం అదుపులోనే ఉంది. ఇదే కాలంలో ఆహార ద్రవ్యోల్బణం 1.6% నుండి 1.8% కు మాత్రమే పెరిగింది.

చమురు మరియు సహజ వాయువుల ధరలలో పెరుగుదల వల్ల టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం పెరిగింది. ఇది గత నెలనుండి ఈ నెలకు 26.9 శాతం నుండి 48.7 శాతానికి చేరుకుంది. అదేవిధంగా ఇంధన మరియు విద్యుత్ రంగ ద్రవ్యోల్బణం ఇదే కాలంలో 11.2% నుండి ద్రవ్యోల్బణం 16.2% కు పెరిగింది. తయారీ రంగంలో టోకు ద్రవ్యోల్బణం మే నెలలో ఉన్న 3.73% నుంచి జూన్ నెలలో 4.17% కి పెరిగింది. 

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అవసరమైన అన్ని డాక్యుమెంట్లను ఈ వారంలో కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు రాష్ట్ర నీటిపారుదల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు తెలియజేసారు. 

ప్రముఖ ఇంజనీర్ డాక్టర్ కే.ఎల్.రావు యొక్క 116వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగిస్తూ మంత్రి ఈ వ్యాఖ్యలు చేసారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సూచనల మేరకు ఇలా చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. వచ్చే వారంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్చల ద్వారా పెండింగ్ లో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించుకునే ప్రయత్నం చేయనున్నాయి.

చింతపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆగష్టు 15 నాటికి పూర్తి చేస్తామని, 2019 ఫిబ్రవరి నాటికి పోలవరం ప్రాజెక్ట్ పనులు పూర్తి చేస్తామని మంత్రి విశ్వాసం వ్యక్తం చేసారు. సంవత్సరం లోపల ప్రకాశం బారేజ్ దిగువన చోడవరం డ్యామ్ నిర్మిస్తామని ఆయన తెలిపారు.  కే.ఎల్.రావు యొక్క నైపుణ్యం హరిత విప్లవానికి దోహదం చేసిందని మంత్రి తన అభిప్రాయం వెలిబుచ్చారు. గంగ కావేరి అనుసంధానం గురించి కే.ఎల్.రావు గారే మొదటిసారిగా మాట్లాడారని, ఆయన అడుగుజాడల్లోనే ముఖ్యమంత్రి గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేసారని మంత్రి అన్నారు. 

ఈ సమావేశానికి ఇంజనీర్ ఇన్ చీఫ్ ఎం.వెంకటేశ్వర రావు, ఇ.ఎన్.సి. (పరిపాలన) కె. శ్రీనివాస్, కృష్ణ డెల్టా చీఫ్ ఇంజనీర్ ఆర్.సతీష్ కుమార్, మరియు అపెక్స్ కమిటీ సభ్యుడు అల్లా గోపాలకృష్ణ హాజరయ్యారు.


జులై 11వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను ఆర్భాటంగా ప్రారంభించింది. కానీ వీటి పబ్లిసిటీ విషయంలో తగినంత జాగ్రత్తలు తీసుకోలేదు. ఈ క్యాంటీన్ల  ప్రకటనలలో మరియు హోర్డింగ్స్ లో రాజన్న క్యాంటీన్లో తింటున్న ఇద్దరు వ్యక్తుల ఫోటోను వాడుకున్నారు. ఈ రాజన్న క్యాన్టీన్లు 2017 లో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి ప్రారంభించినవి కావటం విశేషం. ఈ ఫోటో ఫేస్ బుక్ మరియు ఇతర సోషల్ మీడియాలో ఆ సమయంలోనే విస్తృతంగా షేర్ చేయబడింది. 

ఇద్దరు వ్యక్తుల ఫోటో - ఒక ముస్లిం, మరో భుజం పైన టవల్ తో ఉన్న వ్యక్తి. అన్నా క్యాంటీన్ల న్యూస్ పేపర్ ప్రకటనలో, పట్టణాలలో ఉన్న హోర్డింగ్స్  లో ప్రముఖంగా దర్శనమిచ్చారు. ఈ ఫోటోలను పోలుస్తూ సోషల్ మీడియాలో మొదలైన ట్రోలింగ్ వైరల్ గా మారింది. 

ఈ నెలలో సమాచారం మరియు పబ్లిక్ రిలేషన్స్ (ఐ  & పిఆర్) అధికారులు, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంటు వారి చేత ఈ ప్రకటనలు  జారీ చేయబడ్డాయి. వారు దీనిపై ఇంకా ఏమీ సమాధానం ఇవ్వలేదు. 

శ్రీరెడ్డిది అంతులేని కథ
శ్రీ రెడ్డి ఈ మధ్య కోలీవుడ్ పై వరసగా విమర్శలు చేస్తూ వెళ్తోంది. హీరో సందీప్ కిషన్ని అయితే రాయడానికి వీల్లేని భాషలో తిట్టేసింది.  కెమెరామన్ సెంథిల్ కుమార్, దర్శకుడు సి సుందర్ లపై కూడా కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసింది. ఆడపిల్లల ఉసురు పోసుకొని ఎవరూ బాగుపడలేదని శాపనార్థాలు కూడా పెట్టింది.  పనిలో పనిగా పవన్ కళ్యాణ్ పై ఫేస్ బుక్ వీడియో ద్వారా రాజకీయ విమర్శలు చేసింది. తనకు మద్దతిచ్చిన శింబు తండ్రి రాజేందర్  కు కృతఙ్ఞతలు తెలిపింది. సినిమా హీరో అయినంత మాత్రాన ముఖ్యమంత్రి పదవి ఇవ్వరు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తెలుగు దేశం పార్టీ నేత, ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య తీవ్ర వ్యాఖ్యలు చేసారు. పోరాట యాత్రల పేరిట పవన్ ఈ మధ్య రాష్ట్ర పర్యటన చేస్తున్న విషయంపై మాట్లాడుతూ పవన్ పదవి కోసమే రోడ్ల మీద తిరుగుతున్నారని, సినిమా హీరో అని సినిమాల్లోలాగా ముఖ్యమంత్రి పదవి ఇవ్వమంటే ప్రజలు ఇవ్వరని అన్నారు. 

గతంలో ఈయన అన్న చిరంజీవి కూడా ప్రజా రాజ్యం పార్టీ స్థాపించి ముఖ్యమంత్రి పదవి కోసం ఇలాగే తిరిగారని విమర్శించారు. 

ఇప్పుడు రాష్ట్రంలో సినిమా హీరోలను ముఖ్యంమంత్రులుగా చేసే పరిస్థితి లేదని, ఇది అవగాహన లేనివారే రోడ్ల మీద తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు. కేవలం ఎన్టీఆర్ కు మాత్రమే ప్రజలు ఓట్లేసి గెలిపించిన ఘనత దక్కిందన్నారు. 

టిఆర్ఎస్ మద్ధతు కోరిన తెలుగు దేశం ఎంపీలు
జులై 18 నుండి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాలలో తమ నిరసన గళాన్ని గట్టిగా వినిపించేందుకు తెలుగుదేశం పార్టీ ఎంపీలు సిద్ధమవుతున్నారు. దీనికోసం ఇతర పార్టీల మద్దతును కూడగట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఎంపీలు సుజనాచౌదరి, కొనకళ్ల నారాయణ, నిమ్మల కిష్టప్ప, శ్రీరాం మాల్యాద్రిలు తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కే. కేశవరావు నాటికి వెళ్లి పార్లమెంట్లో తమ డిమాండ్లకు మద్దతు తెలుపవలసిందిగా కోరారు. ఆయన సానుకూలంగా స్పందించారని సుజనా చౌదరి వెల్లడించారు. 

కేశవరావు మాట్లాడుతూ విభజన హామీలు అమలు చేయటం తెలంగాణ రాష్ట్రానికి కూడా అవసరమని అన్నారు.  మరో ఎంపీ జితేందర్ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ దఫా పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ ప్రవేశ పెడతామన్న అవిశ్వాస తీర్మానం  గురించి ప్రస్తావించారో, లేదో తెలియరాలేదు. 

డీఎంకే పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు T.K.S. ఇళంగోవన్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుతో ఆయన క్యాంపు ఆఫీసు లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆగస్టు 30 వ తేదీన చెన్నైలో 'రాష్ట్రాల స్వయంప్రతిపత్తి-ఫెడరలిజం' అనే అంశంపై జరగనున్న సమావేశానికి ఆయనను ఆహ్వానిస్తూ డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.కె. స్టాలిన్ వ్రాసిన లేఖను అందజేశారు.

టిఆర్ఎస్ బిజెపిలు రెండూ మిత్రపక్షాలే
బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లులోని ఇతర హామీలను నెరవేర్చటంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యంపై అధికార టిఆర్ఎస్ ప్రభుత్వం మౌనంగా ఉండటాన్ని సీపీఎం కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ప్రశ్నించారు. 

ఆదివారం ఖమ్మంలో జరిగిన బహుజన వామపక్ష పార్టీ (బిఎఫ్ఎఫ్) ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గం సమావేశంలో ప్రసంగిస్తూ, టిఆర్ఎస్ పై విరుచుకపడ్డారు. ఆ పార్టీ బహిరంగంగా నోట్ల రద్దు, జీఎస్టీ లాంటి కేంద్ర ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలకు మద్ధతు తెలిపిందని, నోట్ల రద్దు సమయంలోనే రాష్ట్రపతి ఎన్నికలలో బీజేపీ పార్టీ నిలబెట్టిన అభ్యర్థికి ఓటు వేసిందని దుయ్యబట్టారు. టిఆర్ఎస్ కు బిజెపితో ఒప్పందం ఉందని, రెండూ మిత్రపక్షాలేనని ఆయన వ్యాఖ్యానించారు. 

రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో, విభజన హామీలపై కేంద్రం పై ఒత్తిడి చేయడంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు.  ఎస్సిలు, ఎస్టీలు, బిసిలు, మైనారిటీలు, మరియు ఇతర పేద వర్గాలన్నీ బిఎల్ఎఫ్ కు మద్దతిచ్చి టిఆర్ఎస్ ను మట్టి కరిపించాలని ఆయన పిలుపునిచ్చారు. 

బోనాల ఉత్సవాలు ప్రారంభం
ఆషాఢ మాస సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన బోనాల ఉత్సవాలు ఆదివారం రోజు గోల్కొండలో జరిగిన వేడుకలతో అధికారికంగా ప్రారంభమయ్యాయి. 

ఉప ముఖ్యమంత్రి మహమ్మద్ అలీ, మంత్రులు నాయని నర్సింహా రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, మరియు తలసాని శ్రీనివాస్ యాదవ్ లు పూజలు జరిపి లంగర్ హౌస్ నుండి ప్రారంభమయ్యే ఊరేగింపును మొదలుపెట్టారు. ఊరేగింపు ముగిసిన అనంతరం గోల్కొండ కోటలో అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. కోటపైకి వెళ్లే మెట్లను పసుపు, కుంకుమలతో అలంకరించారు. 

గోల్కొండ వేడుకలతో హైదరాబాద్ నగరంలో బోనాల ఉత్సవాలు ప్రారంభమైనట్లు భావిస్తారు. ఆ తర్వాత నగరంలోని వివిధ ప్రాంతాలలో బోనాలు జరగటం ప్రారంభమవుతాయి. ఈ నెల 29, 30 వ తేదీలలో జరుగే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు, తర్వాత వారం జరిగే లాల్ దర్వాజ అమ్మవారి బోనాలతో  ఉత్సవ సంరంభం పతాకస్థాయికి చేరుతుంది. 

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget